బీమా సొమ్ము కోసం మామ హతం
కశింకోట: బీమా సొమ్ము కోసం సొంత మామనే హతమార్చాడు.. ఎల్‌ఐసీ ఏజెంటుతో కలిసి ఆరు నెలలుగా పథకం వేశాడు.. హత్య చేసి, రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టుగా మాయ చేయబోయాడు. పోలీసుల దర్యాప్తులో అనుమానాలు రేకెత్తడం, ఇది ప్రమాద మరణం కాదని పోస్టుమార్టం రిపోర్టు వెల్లడించడంతో దొరికిపోయాడు. కశింకోట మండలం కొత్తపల్లి గ్రామం వద్ద జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వివరాలను స్థానిక పోలీసు స్టేషన్‌లో సీఐ అల్లు స్వామినాయుడుతో కలిసి అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి శనివారం విలేకరులకు వివరించారు. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కుర్రు నారాయణమూర్తి (54) బయ్యవరంలోని సిమెంట్ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తున్నారు. విధులు నిర్వహించుకొని ఈనెల 8న రాత్రి తమ గ్రామానికి బైక్‌పై వెళుతుండగా అదే గ్రామానికి చెందిన సొంత అల్లుడు, మేనల్లుడు సుంకరి అన్నవరం, అతని కుమారుడు సుంకరి జ్యోతి ప్రసాద్, సహాయకునిగా పనిచేసే అగ్రహారపు తాతాజీ ఆపి పక్కన పొలంలోకి తీసుకెళ్లి నారాయణమూర్తితో మద్యం తాగించారు. మత్తులోకి వెళ్లాక ఇంటి పనిలో వినియోగించే గజం బద్దతో తలపై కొట్టి గాయపరిచారు. వారి దెబ్బలతో తీవ్రంగా గాయపడిన నారాయణమూర్తి ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని చెప్పి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మార్గమధ్యంలో మృతి చెందినట్టు చెప్పారు. ఈ నెల 9న కేజీహెచ్ నుంచి పోలీసులకు ఎంఎల్‌సీ సమాచారం అందింది.
బీమా పరిహారం కోసమే....
హత్యకు ప్రధాన ప్రేరకుడైన అల్లుడు అన్నవరం అప్పుల్లో కూరుకుపోయాడు. వీటి నుంచి బయటపడటానికి మామను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి ఆయన పేరిట ఉన్న రూ.కోటి 8 లక్షల విలువైన ఏడు రకాల పాలసీల ద్వారా వచ్చే పరిహార సొమ్మును కాజేయాలని ఆశించాడు. ఎల్‌ఐసీ ఏజెంటు నానాజీ సహాయంతో ఆరు నెలల క్రితం హత్యకు వ్యూహ రచన చేసి ఇంత ఘాతుకానికి పాల్పడ్డాడు. చివరికి సాక్ష్యాలతో సహా దొరికిపోవడంతో ప్రధాన నిందితుడు అన్నవరం, అతని కుమారుడు జ్యోతి ప్రసాద్, సహాయకుడు తాతాజీ, ప్రోత్సాహకుడు ఎల్‌ఐసీ ఏజెంటు నానాజీలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హత్య కేసును ఛేదించి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సీఐతోపాటు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లను డీఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు.
రోడ్డు ప్రమాదమని ఫిర్యాదు
గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోవడంతో నారాయణమూర్తి మృతి చెందినట్లు నమ్మించి అన్నవరం అత్త సూర్యలక్ష్మితో పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ అల్లు స్వామినాయుడు, ఎస్‌ఐ లక్ష్మణరావు, మనోజ్‌కుమార్‌లకు రోడ్డు ప్రమాదం జరిగిన దాఖలాలు కానరాలేదు. అతని బైక్ నిక్షేపంలా ఉంది. దీంతో పోలీసులు అనుమానించారు. విచారణకు వెళ్లినప్పుడు అల్లుడు అన్నవరం సహకరించకపోవడంతో.. అతని కుమారుడు జ్యోతి ప్రసాద్‌ను తీసుకు వచ్చి స్టేషన్‌లో విచారించగా అతను తడబడడంతో వారి సందేహాలు మరింత బలపడ్డాయి. ఇంతలో ఇది ప్రమాదం కాదని, కొట్టిన గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. అల్లుని సెల్‌ఫోన్ కాల్ డేటా పరిశీలించగా అచ్యుతాపురం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన ఎల్‌ఐసీ ఏజెంటు భీముని నానాజీకి సుమారు వందసార్లు ఫోన్ చేసినట్టు వెల్లడైంది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అన్నవరం నేరం అంగీకరించాడు.


