ఏయూ తెలుగు విభాగం అరుదైన ఘనత
బీచ్‌రోడ్డు (విశాఖ): ఏయూ తెలుగు విభాగం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ–2025లో ఈ విభాగానికి చెందిన 52 మంది విద్యార్థులు ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వీరిని తెలుగు విభాగం శాఖాధిపతి ఆచార్య జెర్రా అప్పారావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథి ఏయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎ.నరసింహారావు మాట్లాడుతూ వందేళ్ల పండగ జరుపుకుంటున్న ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులంతా ధన్యజీవులన్నారు. ఉపాధ్యాయ కొలువులు పొందిన వారిని అభినందిచారు. ఆచార్య జెర్రా అప్పారావు మాట్లాడుతూ తన హయాంలో ఒకే డీఎస్సీలో 52 మంది విద్యార్థులు టీచర్ ఉద్యోగాలు సాధించడం మధుర ఘట్టంగా నిలిస్తుందన్నారు. ఏయూ పరిశోధక విద్యార్థి, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు సమన్వయకర్తగా వ్యవహరించిన గౌరవ ఆచార్యుడు పర్వతనేని సుబ్బారావు, బహు గ్రంథకర్త, లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డు గ్రహీత, గౌరవాచార్యుడు వెలమల సిమ్మన్న పాల్గొన్నారు.


