భూ వివాదంలో తీవ్ర ఉద్రిక్తత
దేవరాపల్లిలో భారీగా మోహరించిన పోలీసులు
వివాదానికి కారణమైన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ శ్రావణి
ఇరువర్గాల పై బైండోవర్ కేసుల నమోదుకు ఆదేశం
గ్రామంలో పోలీస్ పికెట్
దేవరాపల్లి: మండల కేంద్రం దేవరాపల్లిలో భూ వివాదం బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరువర్గాలవారు బాహాబాహీకి సిద్ధపడటంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ వివాదాన్ని ముందుగానే పసిగట్టిన స్థానిక ఎస్‌ఐ వి.సత్యనారాయణ వివాదాస్పద ప్రాంతానికి తమ సిబ్బందితో కలిసి చేరుకున్నారు. ఇరువర్గాల వారు భారీ సంఖ్యలో ఉండడంతో ఎస్పీ తుహిన్ సిన్హా దృష్టికి తీసుకెళ్లారు. ఎస్పీ ఆదేశాలతో గంటల వ్యవధిలోనే జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన పోలీసు బలగాలు వివాదస్పద ప్రాంతం వద్ద మోహరించాయి. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇరువర్గాలకు పోలీసులు సూచించినా వారు వెనక్కి తగ్గలేదు. ఆ స్థలంలో ఉన్న వారిని అక్కడి నుంచి పంపిస్తే తప్పా తాము వెనక్కి తగ్గబోమని మరో వర్గానికి చెందిన వారు పోలీసులకు తెగేసి చెప్పారు. భూమిలోకి వెళ్లేందుకు ఓవర్గానికి చెందిన వారు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డగించారు. దీంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పకుండా స్థానిక ఎస్‌ఐ సత్యనారాయణ ఇరువర్గాలతో వేర్వేరుగా చర్చలు జరిపారు. ఉదయం నుంచి పలుమార్లు జరిపిన చర్చలు మధ్యాహ్నం తర్వాత ఫలించాయి. ఇరువర్గాల వారిని అక్కడి నుంచి పంపించేయడంతో వివాదం సద్దుమణిగింది. గ్రామంలో భారీ స్థాయిలో పోలీసులు మోహరించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానిక ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇరువర్గాలతో చర్చించిన డీఎస్పీ
ఇరువర్గాల మధ్య వివాదానికి దారి తీసిన ఘటనపై అనకాపల్లి డీఎస్పీ ఎం. శ్రావణి సమీక్షించారు. ముందుగా వివాదానికి కారణమైన స్థలాన్ని ఆమె బుధవారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం దేవరాపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడారు. తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని రెవెన్యూ రికార్డుల్లో తారుమారు చేసి ఆ భూమితో సంబంధం లేని వ్యక్తితో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, తమకు న్యాయం చేయాలని వేచలపు అప్పలనాయుడు, జాగరపు రాజునాయుడు, జాగరపు వెంకటరావు డీఎస్పీ ని కోరారు. తాము భూమి కొనుగోలు చేశామని, న్యాయస్థానం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని కిలపర్తి భాస్కరరావు డీఎస్పీకి తెలిపారు. అనంతరం డీఎస్పీ స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఈ భూమిపై ఇప్పటికే కోర్టు తీర్పు చెప్పడంతో అన్యాయం జరిగిందని భావిస్తున్న వారు న్యాయస్థానాన్ని గాని కలెక్టర్, ఆర్డీవోలను ఆశ్రయించి అనుకూలంగా ఆర్డర్ తెచ్చుకోవాలని, అప్పటి వరకు భూమిలోకి వెళ్లొద్దని సూచించినట్లు చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకవర్గానికి చెందిన కిలపర్తి భాస్కరరావు, మరో వర్గానికి చెందిన జాగరపు రాజునాయుడు, వెంకటరావు, వేచలపు అప్పలనాయుడుపై బైండవర్ కేసులు నమోదు చేసి తహసీల్దార్ ముందు హాజరుపరుస్తామన్నారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామని, గురువారం కూడా పికెట్ కొనసాగుతుందన్నారు.
భూ వివాదంలో తీవ్ర ఉద్రిక్తత


