ఏలేరు కాలువలో పడి ఆరేళ్ల బాలుడు గల్లంతు
కశింకోట: ఆరేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ ఏలేరు కాలువలో జారి పడి గల్లంతయ్యాడు. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాలివి. ఉగ్గినపాలెం గ్రామంలో బంధువుల ఇంటికి అయ్యప్పస్వామి ఇరుముళ్ల కార్యక్రమానికి అచ్యుతాపురం మండలం కొండకర్ల గ్రామానికి చెందిన సబ్బి రిత్విక్ (6) బంధువులతో కలిసి బుధవారం ఉదయం వచ్చాడు. ఈ సందర్భంగా స్థానిక లిక్షిత్ అనే మరో బాలునితో కలిసి అక్కడి ఏలేరు కాలువ వద్ద ఆడుకోవడానికి వెళ్లాడు. వారు ఆడుతూ కాలువలో జారి పడి నీటిలో మునిగిపోతుండగా స్థానిక యువకుడు సాహసించి లిక్షిత్‌ను వెలికి తీసి కాపాడాడు. ఇంతలో రిత్విక్ మాత్రం నీటిలో కొట్టుకుపోయాడు. ఈ మేరకు అందిన సమాచారంపై సీఐ, ఎస్‌ఐ పి.మనోజ్‌కుమార్, సిబ్బందితో సంఘటన స్థలాన్ని సందర్శించారు. బాలుని ఆచూకీ కోసం ఈతగాళ్లతో గాలించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ బృందం, అగ్నిమాపక సిబ్బంది కూడా బోటు సాయంతో కాలువలో ముమ్మరంగా గాలించారు. అయినా రిత్విక్ జాడ తెలియలేదు. చీకటి పడడంతో వెనుదిరిగారు. ఘటనపై కేసు నమోదు చేసినట్టు సీఐ స్వామినాయుడు తెలిపారు. గురువారం కూడా గాలింపు జరుపుతామన్నారు. రిత్విక్ కొండకర్ల వద్ద ఉన్న ప్రైవేటు స్కూల్లో 1వ తరగతి చదువుతున్నాడు. తండ్రి శ్రీను అయ్యప్ప దీక్ష పూర్తి కావడంతో శబరిమలై దర్శనానికి వెళ్లగా, తల్లి రోహిణి అచ్యుతాపురం ప్రాంతంలో పనికి వెళ్లారు. ఈ నేపథ్యంలో బాలుడు కుటుంబ సభ్యులతో రాగా ఆడడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ కాలువలో గల్లంతయ్యాడు. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. రిత్విక్‌కు తమ్ముడు శ్రీకర్ ఉన్నాడు.
ఏలేరు కాలువలో పడి ఆరేళ్ల బాలుడు గల్లంతు
ఏలేరు కాలువలో పడి ఆరేళ్ల బాలుడు గల్లంతు


