సుజల స్రవంతికి రైతులు సహకరించాలి
బుచ్చెయ్యపేట: త్వరలో మండలంలో ఏర్పాటు చేసే సుజల స్రవంతి ప్రాజెక్ట్‌కి రైతులందరూ సహకరించి, భూములు ఇవ్వాలని కలెక్టర్ విజయ కృష్ణన్ కోరారు. కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రంలో మండల స్థాయి రైతన్నా మీ కోసం వర్క్ షాపును బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ సేంద్రియ సాగుపై దృష్టి సారించాలని తెలిపారు. 1950–60 కాలంలో మన పూర్వీకులంతా సేంద్రియ ఎరువులతో పంటలు పండించడం వల్ల ఆరోగ్యకరమైన పంట వచ్చి అంతా వ్యాధులకు దూరంగా ఉండేవారన్నారు. జిల్లాలో 24 మండలాల్లో 12 మండలాలు ఇండస్ట్రియల్ ఏరియాగా మారిపోయిందని, మిగిలిన మండలాల్లో ఆరోగ్యకరమైన పంటలు పండించడానికి రైతులు ముందుకు రావాలని తెలిపారు.
రైతులకు సమాచారం ఇవ్వకుండా..
మండల స్థాయి రైతన్నా మీ కోసం కార్యక్రమాన్ని అధికారులు గోప్యంగా నిర్వహించారు. రైతులకు మందస్తు సమాచారం ఇవ్వలేదు. కేవలం కొంతమంది టీడీపీ నాయకుల ద్వారా వారి గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు,అనుకూలంగా ఉన్నవారిని సభకు తీసుకొచ్చారు. రైతులకంటే టీడీపీ కార్యకర్తలే ఎక్కువ మంది హాజరయ్యారు. మీడియాకు కూడా సమాచారం ఇవ్వకుండా మండల అధికార్లు తూతూ మంత్రంగా నిర్వహించారు. మొదటి దఫాలో కొంతమందికి గోకుల షెడ్డులు ఇచ్చి, రెండోవ దఫాలో ఎవరికీ ఇవ్వలేదని బుచ్చెయ్యపేటకు చెందిన రైతు పూడి రామారావు వాపోయాడు. నాలుగు, ఐదు ఎకరాలు ఉన్న రైతులకు కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) అధికారులు విత్తనాలు ఇవ్వడం లేదని, అర ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు, కేవీకేలో పని చేస్తున్న సిబ్బంది కుటుంబ సభ్యులకు మాత్రమే సబ్సిడీ విత్తనాలు అందుతున్నాయని పలువురు రైతులు వాపోయారు. కలెక్టర్ కూర్చున వేదిక మీద సైతం పదవులు లేని టీడీపీ నాయకులను కూర్చోబెట్టారు. మండలంలో ఉన్న పలువురు ఆదర్శ రైతులున్నా వారిని వేదికపై కూర్చోబెట్టలేదు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆశాదేవి, నియోజకవర్గ ప్రత్యేకాధికారి శ్రీనివాస్,పలు శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.
రైతన్నా మీ కోసం కార్యక్రమంలోకలెక్టర్ విజయ కృష్ణన్


