ఆస్పత్రి సిబ్బందిపై హోం మంత్రి ఆగ్రహం
పాయకరావుపేట: స్థానిక పీహెచ్‌సీని హోం మంత్రి వంగలపూడి అనిత బుధవారం ఆకస్మికంగా తనికీ చేశారు. ఆ సమయంలో ఆస్పత్రిలో డాక్టర్ అందుబాటులో లేకపోవడం, డ్యూటీలో ఉన్న నర్సు హాజరు రిజిస్టర్‌లో సంతకం పెట్టకపోవడం, యూనిఫాం వేసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో వార్డులను, ల్యాబ్, ఓపీ, ఫార్మసీ విభాగాలు, పరిసరాలను పరిశీలించారు. అధ్వానంగా ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రి చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలను చూసి అసహనం వ్యక్తం చేశారు. వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రిలో వైద్యుడు లేకపోవడం, పరిసరాలు అధ్వానంగా ఉండడంతో డీఎంహెచ్‌వోకు ఫోన్‌చేసి సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయమై పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ సుభాష్‌ను వివరణ కోరగా తాను నక్కపల్లిలో ప్రజాదర్బార్‌కు హాజరైనట్టు చెప్పారు. మంత్రి ఆస్పత్రికి వచ్చిన సమయంలో తాను అందుబాటులో లేనన్నారు. సందర్శించిన విషయం తెలుసుకుని వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని చెప్పారు. మంత్రి తనిఖీ పూర్తి చేసి వెళ్లే వరకు అక్కడే ఉన్నానన్నారు.
చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వోకు ఆదేశం


