కదం తొక్కిన మూడు గ్రామాలు
పెదపల్లి చెరువు భూమి కోసం యువకుల ఆందోళనకు మద్దతు యలమంచిలిలో భారీ ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన
తీవ్ర ఉద్రిక్తత
దేవరాపల్లి మండలంలో భూ వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
యలమంచిలి రూరల్: పెదపల్లి సర్వే నెంబరు 286లో నిషేధిత జాబితాలో ఉన్న 3.27 ఎకరాల భూమిని ఒక వ్యక్తికి కట్టబెట్టడానికి చూస్తున్న అధికారుల తీరును నిరసిస్తూ ముగ్గురు యువకులు చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా పెదపల్లి, మంత్రిపాలెం, పెదగొల్లలపాలెం గ్రామాల ప్రజలు బుధవారం యలమంచిలిలో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. సుమారు 300 మంది పట్టణంలో రైల్వేస్టేషన్ రోడ్డు నుంచి వైఎస్సార్ కూడలి, ప్రధాన రహదారి మీదుగా దిమిలిరోడ్డు కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని అధికారులు న్యాయం చేయాలని, చెరువుగా నమోదైన భూమిని తిరిగి నిషేధిత జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. శిబిరం వద్దకు వచ్చి దీక్షాధారులకు తమ మద్దతు తెలియజేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లిన ఆందోళనకారులు చెరువు భూమిని 22 ఏ జాబితా నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ఈ విషయంలో నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. గ్రామం ఉమ్మడి అవసరాలకు ఉపయోగపడేలా ఆ భూమిని నిషేధిత జాబితాలో చేర్చాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. యలమంచిలి సీఐ, ఎస్సైలు ఉపేంద్ర, సావిత్రి, రామకృష్ణ, సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామస్థుల ఆందోళనకు వైఎస్సార్‌సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, మున్సిపల్ చైర్‌పర్సన్ పిల్లా రమాకుమారి, పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు బోదెపు గోవింద్, బొద్దపు ఎర్రయ్యదొర, దాసరి కుమార్, దాసరి గణేష్ తదితరులు మద్దతు తెలిపారు.


