పాలిటెక్నిక్ డిప్లొమా.. భవితకు ధీమా
వైఎస్సార్‌సీపీ హయాంలో రేబాక కళాశాలలో సకల వసతులు పాలిటెక్నిక్ పట్టాతో మూడేళ్లకే కొలువు టాప్ కంపెనీల్లో కళాశాల విద్యార్థులకు ఉద్యోగాలు ఏడాదికి రూ.8 లక్షల వరకు ప్యాకేజీలతో కొలువులు
పదో తరగతి తర్వాత స్వల్ప వ్యవధిలోనే ఉద్యోగం, ఉపాధి పొందాలనుకునే విద్యార్థులకు అందుబాటులో ఉన్న చక్కటి మార్గం పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు. సమాజంలో పేద పిల్లలకు కూడా కార్పొరేట్ విద్యతో పాటు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాల కల్పనే లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చి అనకాపల్లి మండలం రేబాక గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను తీర్చిదిద్దింది. కళాశాలలో నిష్ణాతులైన అధ్యాపకులతో పాటు అధునాతన పరికరాలతో తరగతి గదులు, ల్యాబ్‌లు, కంప్యూటర్లతో పాటు సాంకేతికత జోడించి విద్యార్థుల్లో కమ్యూనికేషన్ నైపుణ్యాల పెంపునకు చర్యలు చేపట్టింది. దీంతో ప్రస్తుతం పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు మంచి డిమాండ్ ఏర్పడింది.
తుమ్మపాల: ఒకప్పుడు డిప్లొమా అంటే తెలియని వారెందరో ఇప్పుడు ఆ కోర్సులు వైపే మొగ్గు చూపుతున్నారు. పదో తరగతి తరువాత సంప్రదాయ విద్య ఇంటర్, డిగ్రీలతో జీవితాంతం నిరుద్యోగులుగా మిగిలిపోయే రోజుల నుంచి డిప్లొమా పట్టాతో మూడేళ్లకే ఉద్యోగం చేత పట్టుకుని ఇంటికొస్తున్నారు. అనకాపల్లి మండలం రేబాక గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను 2008లో పదెకరాల స్థలంలో మూడు బ్లాకులుగా భవనాలు నిర్మించి ప్రారంభించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చి 2019 నుంచి 2024 మధ్య ప్రభుత్వ విద్యా రంగాన్ని సమూలంగా మార్చారు. ఇలా రేబాక కళాశాలలో విద్యార్థులు నాణ్యమైన బోధనతో పాటు సకల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఎన్‌బీఏ అక్రిడిటేషన్ 2023–24 నుంచి 2025–26 అర్హత పొందిన ఏకై క కళాశాలగా పేరొందింది.
ప్లేస్‌మెంట్ పక్కా..
కళాశాలలో ఉన్న రెండు కోర్సుల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులు మొత్తం 396 మంది చదువుతుండగా.. మూడో ఏడాది పూర్తయిన 132 మంది వంద శాతం ప్లేష్‌మెంట్‌తో బయటకు వచ్చారు. ఈ ఏడాది ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్–66, కంప్యూటర్ ఇంజినీరింగ్–66 మంది రెండు కోర్సుల్లో మొత్తం 132 మంది విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత, ఉద్యోగం సాధించారు. ఎలక్ట్రానిక్స్‌కు మంచి డిమాండ్ ఉండడంతో అధ్యాపకులు విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు. అందుకు తగ్గట్టు నైపుణ్యాలు, ల్యాబ్స్‌పై పట్టు ఉండేలా తయారు చేస్తున్నారు. పరిశ్రమ అనుసంధాన సిలబస్‌పై శిక్షణ ఇస్తున్నారు. దీంతో ప్రముఖ టాప్ కంపెనీలు ఏడాదికి రూ.8.5 లక్షల ప్యాకేజీలు ఇచ్చి డిప్లొమా విద్యార్థులను ఎంపిక చేసుకోవడంపై మక్కువ చూపిస్తున్నాయి.
మూడేళ్లలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల వివరాలు
ఏడాది ఉద్యోగం మొత్తం ఉద్యోగ
2023–24 90 125 72
2024–25 121 121 100
కంపెనీ సాయంతో ఉన్నత చదువు
డిప్లొమా ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్నాను. మేథా సర్వో కంపెనీలో ఏడాదికి రూ.3.2 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం పొందాను. హైదరాబాద్‌లో పని చేసేందుకు కాల్ లెటర్ కూడా పంపించారు. దీంతో పాటు కంపెనీ వారి సహాయంతో ఉన్నత చదువుకు కూడా అవకాశం కల్పించారు. కళాశాలలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండడంతో మూడేళ్లకే ఉపాధి పొందగలిగాం. – ఎస్.హారిక, ఈసీఈ థర్డ్ ఇయర్
పాలిటెక్నిక్ డిప్లొమా.. భవితకు ధీమా
పాలిటెక్నిక్ డిప్లొమా.. భవితకు ధీమా


