కన్నీటి రోదన.. అంతులేని వేదన
మునగపాక: తుది లేని ఆవేదన.. కొనసాగిన ఆందోళన.. ఇదీ తిమ్మరాజుపేటలోని డావెన్సీ అంతర్జాతీయ పాఠశాల వద్ద శుక్రవారం కనిపించిన దృశ్యం. స్విమ్మింగ్ మీద ఇష్టంతో ట్రెయినింగ్ క్లాసుకు వెళ్లిన చిన్నారి ఈత కొలను వద్ద విగత జీవిగా పడి ఉన్న దారుణ ఘటన గురువారం ఎంత కలకలం సృష్టించిందో తెలిసిందే. యలమంచిలి ధర్మవరం ప్రాంతానికి చెందిన జనపరెడ్డి శ్రీనివాసరావు, శ్రీలత దంపతుల రెండో కొడుకై న మోక్షిత్ సందీప్ (8) ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. పాఠశాల యాజమాన్యం కనీసం సమాచారం ఇవ్వకపోవడం, బాలుడు ఇంటికి రాలేదని వెతకానికి వెళితే స్విమ్మింగ్ పూల్ వద్ద మృతదేహం లభ్యం కావడంతో యాజమాన్యం నిర్లక్ష్య ధోరణిపై మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మృతదేహాన్ని కదలనీయకుండా రాత్రంతా నిరసన తెలిపారు. వారి ఆందోళన శుక్రవారం కూడా కొనసాగింది. సీసీ ఫుటేజ్‌ను పరిశీలించేందుకు అవకాశం ఇస్తేనే తన కుమారుని మృతదేహాన్ని పంచనామాకు తీసుకువెళ్లాలని, అంతవరకు తాము సహకరించేది లేదని హెచ్చరించారు. దీంతో పరవాడ, అనకాపల్లి డీఎస్పీలు విష్ణుస్వరూప్, శ్రావణితోపాటు సీఐలు స్వామినాయుడు, ధనుంజయరావు తదితరులు సందీప్ కుటుంబ సభ్యులతో పలుమార్లు చర్చించారు. యాజమాన్యాన్ని స్కూల్‌కు తీసుకువచ్చి సమాధానం చెప్పించాలని ఆందోళనకారులు పట్టుబట్టారు. దీంతో స్కూల్ డైరెక్టర్లు కర్రి సుందరయ్య, జెర్రిపోతుల రమణాజీలను పోలీసు వాహనంలో స్కూల్‌కు తీసుకువచ్చారు. విద్యార్థి మృతి చెందినా ఎందుకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని వారిని పలువురు నిలదీశారు. వివాదం ముదిరే పరిస్థితులు కనిపించడంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ నేతలు బొడ్డేడ ప్రసాద్, కరణం ధర్మశ్రీతోపాటు పలువురు పెద్దలు విద్యార్థి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. దీంతో ఎట్టకేలకు సందీప్ మృతదేహాన్ని అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి పంచనామాకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. బాలుని మృతదేహం పాడయ్యే పరిస్థితుల దృష్ట్యా కుటుంబ సభ్యులు సహకరించాలని పోలీసులు కోరడంతో వారు సమ్మతించారు. స్విమ్మింగ్ పూల్ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు స్కూలు డైరెక్టర్లు సుందరయ్య, రమణాజీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు
సందీప్ మృతదేహాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్ శుక్రవారం సందర్శించారు. పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్‌తో మాట్లాడుతూ.. విద్యార్థి సందీప్ స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతి చెందినా స్కూల్ యాజమాన్యం సకాలంలో స్పందించకపోవడం సరికాదన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని వారు కోరారు.
గుండెలు తరుక్కుపోయే విషాదం ఒకవైపు.. అసలేం జరిగిందో సీసీ టీవీ ఫుటేజ్ చూపాలన్న డిమాండ్ మరో వైపు మిన్నంటగా.. డావెన్సీ అంతర్జాతీయ స్కూల్ ప్రాంగణం ఓ విషాద దుర్ఘటనకు వేదికగా మారింది. శుక్రవారం ఉదయం అక్కడకు చేరుకున్న విద్యార్థి సందీప్ తండ్రి శ్రీనివాసరావు కన్నీటి పర్యంతమైన దృశ్యం అందరినీ కదిలించింది. స్విమ్మింగ్ పూల్ నిర్వహణలో నిర్లక్ష్యమే కాక.. బాలుడు మృతి చెందిన విషయాన్ని కనీసం తెలపకపోవడం వెనుక యాజమాన్యం బాధ్యతారాహిత్యాన్ని మృతుడి బంధువులు తీవ్రంగా నిలదీశారు.
మృతుడి తండ్రి రాకతో
మిన్నంటిన రోదనలు
ఆర్మీ విధుల్లో చేరేందుకు జమ్ము వెళుతున్న తండ్రి శ్రీనివాసరావు మార్గమధ్యంలో వెనుదిరిగి శుక్రవారం ఉదయం డావెన్సీ స్కూల్‌కు చేరుకున్నారు. విగతజీవిగా పడి ఉన్న తన కుమారుడు సందీప్‌ను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. ఒకరోజు ముందు తనతో ఆడిపాడిన కొడుకు ఇలా స్విమ్మింగ్ పూల్ ఘటనలో మృతి చెందడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. కొడుకు సందీప్ మృతదేహాన్ని గుండెలపై హత్తుకొని రోదించిన దృశ్యం అందరినీ కలచివేసింది.
డావెన్సీ స్కూల్ వద్ద
రెండో రోజూ తగ్గని ఉద్రిక్తత
సీసీ ఫుటేజ్ పరిశీలనకు
అనుమతివ్వాలని డిమాండ్
తండ్రి రోదనతో కదిలిపోయిన
పాఠశాల ప్రాంగణం
పోలీసుల అదుపులో
స్కూల్ యాజమాన్యం
కన్నీటి రోదన.. అంతులేని వేదన
కన్నీటి రోదన.. అంతులేని వేదన


