కార్తీక దీపోత్సవం
● నేత్రపర్వంగా చోడవరం గౌరీశ్వరాలయం
● 71 వేల దీపాలతో ఆధ్యాత్మిక వికాసం
చోడవరం: శివనామస్మరణతో చోడవరం స్వయంభూ శ్రీ గౌరీశ్వరస్వామి ఆలయ ప్రాంగణం హోరెత్తిపోయింది. కార్తీక దీపాలు ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లాయి. వంద కాదు వెయ్యి కాదు ఏకంగా 71 వేల దీపాలు వెలిగించగా శివాలయ ప్రాంగణం భక్తుల శరణుఘోషతో మార్మోగింది. అతి ప్రాచీన దేవాలయాల్లో ఒకటైన చోడవరం శ్రీ స్వయంభూ గౌరీశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి కన్నుల పండువగా దీపోత్సవం జరిగింది. శివ, అయ్యప్పస్వామి మాలధారణ భక్తులతోపాటు సాధారణ భక్తులు ఈ దీపోత్సవ కార్యక్రమంలో వందలాదిగా పాల్గొన్నారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ నినాదాలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు కొడమంచిలి చలపతిరావు, వేదపండితుల ఆధ్వర్యంలో వేదమంత్రాల మధ్య మహాలింగ సహిత ద్వాదశ జ్యోతిర్లింగ దీపోత్సవం ఎంతో ఆధ్యాత్మిక శోభను తీసుకువచ్చింది. లింగాకారం, త్రిశూలం, ఓంకారం, స్వస్తిక్, శ్రీ చక్రం ఆకారాలతో దీపాలను వెలిగించారు. ఎ మ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, ఆలయ కమిటీ చైర్మన్ గూనూరు సురేష్, దేవదాయశాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్యనారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
గౌరీశ్వరస్వామి ఆలయం వద్ద దీపోత్సవ కోలాహలం
శివలింగ ఆకారంలో దీపాలంకరణ
కార్తీక దీపోత్సవం


