సినీ రంగానికి ఎదిగిన మునగపాక ఖ్యాతి
మునగపాక: మునగపాక పేరు చెప్పగానే గుర్తు వచ్చేది కళారంగం. ఇక్కడ పలువురు కళలపై ఆసక్తి పెంచుకుంటూ అవసరమైన చోట తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. నాటకరంగ అభివృద్ధికి ఈ ప్రాంత ప్రజలు అందిస్తున్న సహకార స్ఫూర్తి ఎంతోమంది కళాకారులకు ఊపిరి పోస్తోంది. ఇప్పుడు ఆ ప్రతిభే సినీ రంగానికి సైతం విస్తరించింది. మునగపాకకు చెందిన వేద పండితులు వెలవలపల్లి కోటేశ్వరశర్మ నిర్మాతగా ఇదే గ్రామానికి చెందిన డాక్టర్ కోరుకొండ గోపీకృష్ణ దర్శకునిగా తీర్చిదిద్దిన ‘మా ఊరి వెంకన్న’ సినిమా శుక్రవారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. యజ్ఞశ్రీ ప్రొడక్షన్ పేరిట నిర్మించిన ఈ సినిమాలో కొత్త తారాగణం కనిపించనున్నారు. మునగపాకలో నూతనంగా నిర్మిస్తున్న కలియుగ దైవం శ్రీ వెంకన్న ఆలయ పరిస్థితులకు అనుగుణంగా చిత్రాన్ని తయారు చేసినట్లు దర్శకుడు గోపీకృష్ణ తెలిపారు. ఇప్పటికే తాను వాడే–వీడు, కలియుగ భగవాన్ వంటి రెండు చిత్రాలు అందించానని, మూడవ చిత్రంగా ‘మా ఊరి వెంకన్న’ రూపొందించానన్నారు. హాస్యం, భక్తి ప్రధాన అంశాలతో సినిమా తెరకెక్కుతోందని, నిర్మాత కోటేశ్వర శర్మ, పరుచూరి ప్రణవి, మారుతీరాం, పావులూరి శివరామకృష్ణ కీలక ప్రాతలు పోషించారన్నారు.


