ఇక చోడవరంలోనే అమర్‌నాథ్ మకాం
చోడవరం: వైఎస్సార్‌సీపీ చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఇకనుంచి చోడవరంలోనే పూర్తిగా మకాం వేయనున్నారు. ఈ మేరకు ఇక్కడ తన సొంత ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. ఆయన సతీసమేతంగా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. చోడవరం సమన్వయకర్తగా ఇటీవల అమర్‌నాథ్‌ను పార్టీ నియమించిన విషయం తెలిసిందే. ఇక తన భవిష్యత్ రాజకీయమంతా చోడవరం నియోజకవర్గంలోనే అని ఇటీవల అమర్‌నాథ్ బహిరంగంగానే ప్రకటించారు. దీంతో పార్టీ కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేందుకు ఇక్కడ సొంత ఇల్లును, పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇందుకోసం చోడవరం పట్టణ ప్రవేశంలోనే ఇటీవల స్థలాన్ని కొనుగోలు చేసి తాజాగా పనులకు శ్రీకారం చుట్టారు. వేగంగా పనులు పూర్తి చేసి రానున్న రోజుల్లో పూర్తిగా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
సొంతిల్లు, పార్టీ కార్యాలయనిర్మాణానికి భూమిపూజ


