జాతీయ స్థాయి సైన్స్ పోటీల్లో జిల్లా విద్యార్థినుల ఘనత
తుమ్మపాల: ప్రాథమిక స్థాయి నుంచే ప్రతి విద్యార్ధిలో ప్రతిభ ఉంటుందని, ఉపాధ్యాయులు వారి ఆసక్తిని గుర్తించి వినూత్నంగా, ఉన్నతంగా ఆలోచించేలా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో అత్యుత్తమ ప్రదర్శనలతో జిల్లాకు పేరు తీసుకువచ్చిన విద్యార్థినులు కె.లిఖిత, సి.హెచ్. రేణుకాదేవిలను కలెక్టరేట్‌లో గురువారం ఆమెతో పాటు ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు. రాష్ట్రం నుండి ఎంపికై న 52 మంది బృందంలో జిల్లాలో వి.మాడుగుల మండలం కింతలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని కె.లిఖిత, నక్కపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని సిహెచ్.రేణుకాదేవిలు అద్భుత ప్రతిభ సాధించారన్నారు. రష్యన్ స్పేస్ కొలబ్రాషన్‌పై జాతీయ స్థాయి వక్తృత్వం, వ్యాస రచన పోటీల్లో తృతీయ స్థానం సంపాదించి, జిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన లిఖితను ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల కర్నూలులో జీఎస్టీ–2.2 పై జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో నక్కపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని చైత్రని కూడా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు, ప్రధానోపాధ్యాయులు వి. శ్రీలక్ష్మి, ప్రభాకర్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


