బ్యాక్‌లాగ్‌లు | - | Sakshi
Sakshi News home page

బ్యాక్‌లాగ్‌లు

Nov 14 2025 6:10 AM | Updated on Nov 14 2025 6:10 AM

బ్యాక్‌లాగ్‌లు

బ్యాక్‌లాగ్‌లు

ఏయూలో రహస్యంగా

28 పోస్టుల భర్తీ

జిల్లా ప్రజా ప్రతినిధి సిఫార్సు లేఖలకే

పెద్ద పీట

మెరిట్‌ లిస్ట్‌ ఆన్‌లైన్‌లో పెట్టకపోవడంపై

అనుమానాలు

ఆందోళనకు సిద్ధమవుతున్న

దరఖాస్తులుదారులు

బ్యాక్‌డోర్‌లో

విశాఖ సిటీ: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. విద్యార్థులకు పురుగుల భోజనాలు, యూనివర్సిటీలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి చీకట్లు, డిస్పెన్సరీలో ఆక్సిజన్‌ పెట్టే వారు లేక విద్యార్థి మరణం వంటి ఘటనలు శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్న ఏయూ ప్రతిష్టను దిగజార్చాయి. తాజాగా, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీలో అక్రమాల ఆరోపణలు ఏయూలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా 28 పోస్టులను భర్తీ చేయడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రక్రియలో భారీగా సొమ్ములు చేతులు మారాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా కూటమి ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖల మేరకే ఏయూ అధికారులు రహస్యంగా బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేశారని వామపక్ష, విద్యార్థి సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మెరిట్‌ జాబితాను ఆన్‌లైన్‌లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నలు సంధిస్తున్నాయి.

పోస్టుల భర్తీపై వివాదాలు

ఏయూలో 33 బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఉన్నాయి. 2018లో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించారు. కానీ ప్రక్రియ ముందుకు సాగలేదు. 2021లో సెక్యూరిటీ, హాస్టల్‌ సహాయకులు, మెస్‌ వర్కర్లు, తోటపని వంటి ఉద్యోగాలకు మరోసారి నోటిఫికేషన్‌ ఇచ్చారు. కనీస విద్యార్హత ఏడో తరగతి, పదో తరగతిగా నిర్ణయించారు. మెరిట్‌ ఆధారంగా నియామకాలు ఉంటాయని ప్రకటించారు. ఆ సమయంలో సుమారు 1000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో డిగ్రీ, పీజీలు చేసిన అభ్యర్థులు కూడా ఉండడం గమనార్హం. అయినప్పటికీ నోటిఫికేషన్‌ ప్రకారం ఏడో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు కావడంతో ఆ ప్రతిపాదికన మెరిట్‌ జాబితాను సిద్ధం చేసి ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. అయితే ఎంపికై న అభ్యర్థుల విద్యార్హతలు, మార్కుల జాబితాలపై ఫిర్యాదులు వచ్చాయి. ఏడో తరగతి చదవినట్లు, ఎక్కువ మార్కులతో ప్రైవేట్‌ విద్యా సంస్థల నుంచి నకిలీ మార్కుల జాబితాలను సృష్టించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. ఫలితంగా అప్పటి నియామక ప్రక్రియ నిలిచిపోయింది.

ఆన్‌లైన్‌లో ఎంపిక జాబితా ఎక్కడ?

ఏయూలో 33 బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఉండగా.. అందులో 28 పోస్టులను ఏయూ అధికారులు రహస్యంగా భర్తీ చేశారు. ఈ నియామక ప్రక్రియ విషయం ఏయూలో చాలా మంది అధికారులకు కూడా తెలియకపోవడం గమనార్హం. పైగా నోటిఫికేషన్‌ నుంచి మెరిట్‌ జాబితా వరకు ఇప్పటివరకు అధికారులు ఆన్‌లైన్‌లో పొందుపర్చలేదు. రహస్యంగా పోస్టులను ఎలా భర్తీ చేస్తారని గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఏయూ అధికారులను ప్రశ్నించినప్పటికీ.. ఎవరూ సమాధానం చెప్పడం లేదని వాపోతున్నారు. అభ్యర్థుల మెరిట్‌ జాబితాను ఎందుకు ఆన్‌లైన్‌లో పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు.

చక్రం తిప్పిన కూటమిప్రజాప్రతినిధి?

ఏయూలో బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీలో జిల్లాకు చెందిన కూటమి ప్రజాప్రతినిధి చక్రం తిప్పారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నియామకాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగినట్లు ఎస్సీ, ఎస్టీ సంఘాలతో పాటు వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఆ ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖలకు ఏయూ పాలకులు పెద్దపీట వేసినట్లు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏయూను పూర్తిగా రాజకీయ కేంద్రంగా మార్చేశారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ అధికారులు ఈ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియపై విచారణ చేపట్టాలని కోరుతున్నారు. అలాగే అభ్యర్థుల మెరిట్‌ జాబితాను బయట పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement