తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
వలస నాయకులకు పార్టీ పదవులు కట్టబెట్టడంపై ఆగ్రహం
ఎమ్మెల్యే బండారును నిలదీసిన పలువురు ‘పచ్చ’నాయకులు
సహనం కోల్పోయి ‘దుర్భాషలకు దిగిన బండారు
రసాభాసగా గ్రామ, మండల కమిటీల ప్రమాణ స్వీకారం
దేవరాపల్లి: టీడీపీ పాత, వలస నాయకుల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఈసారి బాహాబాహి అంటూ ముష్టి యుద్ధానికి సైతం దిగారు. ఇందుకు దేవరాపల్లిలోని రైవాడ అతిథి గృహం వేదికై ంది. ఈ అతిథి గృహంలో గురువారం జరిగిన టీడీపీ మండల, గ్రామ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు ఏసుదాసు సాక్షిగా పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి తలబడ్డారు. కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ కమిటీలో అన్యాయానికి గురైన పలువురు సీనియర్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహంతో వేదిక వద్దకు దూసుకురావడంతో రసాభాసగా మారి తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పార్టీ పదవుల్లో తమకు జరిగిన అన్యాయంపై సీనియర్ నాయకులు నేరుగా ఎమ్మెల్యే బండారుపై తిరగబడ్డారు. పార్టీ కష్టకాలంలో జెండా మోసిన వారిని పక్కన పెట్టి, ఇటీవల వలస వచ్చిన నాయకులకు పదవులు ఎలా కట్టబెడతారంటూ మారేపల్లికి చెందిన నాయకుడు కిల్లి గోవింద సహా సుమారు వంద మందికిపైగా నాయకులు, కార్యకర్తలు వేదికపై ఉన్న బండారును నిలదీశారు. దీంతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన ఎమ్మెల్యే పరుష పదజాలంతో వారిపై విరుచుకుపడ్డారు. తనను ప్రశ్నిస్తే ఏ స్థాయి నాయకుడినైనా సస్పెండ్ చేస్తానంటూ హుంకరించారు. మీరు తమ పార్టీకి చెందిన వారు కాదని, మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నానని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని రెచ్చకొట్టే ధోరణిలో మాట్లాడడంతో వివాదం మరింత రాజుకుంది. అదే స్థాయిలో అసంతృప్తి వాదులంతా ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు. దీంతో ఎమ్మెల్యే.. పోలీసులను పిలిచి వారిని ఇక్కడి నుంచి బయటకు పంపించేయండి అంటూ అవమానకరంగా వ్యవహరించడంతో అక్కడే ఉన్న పార్టీ నాయకులు విస్మయం వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన సీనియర్ నాయకుల పట్ల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు సరికాదని పార్టీ శ్రేణులు బాహటంగా అసంతృప్తిని వెళ్లగెక్కాయి. పార్టీని నమ్మకున్న వారిని నట్టేట ముంచి కొత్తగా చేరిన వలస పక్షులకు ఎమ్మెల్యే ప్రాధాన్యత కల్పిస్తూ పార్టీని భూస్థాపితం చేస్తున్నారని చింతలపూడి, తామరబ్బ పంచాయతీలకు చెందిన పలువురు టీడీపీ నాయకులు బహిరంగంగా విమర్శించారు. పరస్పర విమర్శలతో అరుపులు, కేకలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. పరిస్థితి అదుపు తప్పడంతో పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు ఏసుదాసు జోక్యం చేసుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేసినా అసంతృప్తి వాదులు శాంతించలేదు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.
తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ


