దేవాలయాలే టార్గెట్
సాక్షి, అనకాపల్లి: గ్రామ శివారు దేవాలయాలే లక్ష్యంగా చోరీలు జరుగుతున్నాయి. ఇటీవల జిల్లావ్యాప్తంగా 26 ఆలయాల్లో హుండీలను దోచుకొని, బంగారం, వెండి ఆభరణాలను అపహరించిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు వ్యసనాలకు, జల్సాలకు బానిసై డబ్బుల కోసం నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండే దేవాలయాలను ఎంచుకొని, అర్ధరాత్రి వేళల్లో హుండీ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవలకాలంలో చోడవరం, బుచ్చెయ్యపేట, వి.మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి మండలాల్లో ఇలాంటి చోరీలకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. వీరు మొత్తం 26 గుడుల్లో దొంగతనాలు చేసి 10.32 గ్రాముల బంగారం, 26 తులాల వెండి, రూ.44,218ల నగదు దోచుకున్నారు. దొంగతనానికి పాల్పడిన నలుగురిలో ఒకరు మేజర్ కాగా.. మిగిలిన ముగ్గురూ మైనర్లు. నేరస్థలంలో దొరికిన ఆధారాల సాయంతో ఆధునిక సాంకేతిక పద్ధతులు వినియోగించి నిందితులను పట్టుకున్నామన్నారు. చోరీ చేసిన డబ్బుల్లో కొంత వారి అవసరాలకు ఖర్చు చేసి.. మిగతా డబ్బు, బంగారం, వెండిని విజయరామరాజుపేట ఏరియాలో దాచి ఉంచారు. గురువారం మైనర్ నిందితులు ముగ్గురు వడ్డాది నుంచి చోడవరం వైపు వస్తుండగా చోడవరం పోలీసులు చోడవరం గ్రామ శివారులో గౌరిపట్నం వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నారు. చోడవరం పీఎస్ పరిధిలో 2, బుచ్చెయ్యపేట పీఎస్‌లో 11, వి.మాడుగుల పీఎస్‌లో 9, చీడికాడ పీఎస్‌లో 2, దేవరాపల్లి పీఎస్‌లో 2 చోట్ల దొంగతనాలు జరిగాయి. ప్రధాన నిందితుడు బుచ్చెయ్యపేట మండలం వడ్డాది గ్రామానికి చెందిన రాసూరి పోతురాజు (20), మిగిలిన ముగ్గురు బాల నేరస్తులు. వీరు కూడా బుచ్చెయ్యపేటకు చెందినవారే. కేసులను ఛేదించిన అడిషనల్ ఎస్పీ (క్రైం) ఎల్.మోహనరావు, అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి, చోడవరం సీఐ పి.అప్పలరాజు, పి.అప్పలరాజు, ఎస్సై బి.నాగకార్తీక్, ఎస్సై బి.జోగారావులను ఎస్పీ అభినందించారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి..
ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ తుహిన్ సిన్హా ఈ సందర్భంగా ఆలయ కమిటీలను కోరారు. అర్ధరాత్రి సమయాల్లో దేవాలయాల్లో ఉన్న హుండీలో డబ్బులు, అమ్మవారి బంగారం, వెండి ఆభరణాలు దొంగతనానికి గురవుతున్నాయని, ఆలయానికి వెలుపుల, లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే చోరీలకు పాల్పడేవారిని గుర్తించేందుకు అవకాశం ఉంటుందని, నేరాలను నియంత్రించవచ్చని ఎస్పీ పేర్కొన్నారు. దూర ప్రాంతాలకు, ఎక్కువ రోజులు క్యాంప్‌లకు వెళ్లేటప్పుడు ఇంట్లో విలువైన డబ్బు, బంగారం ఉంచుకోరాదని, బ్యాంకు లాకర్లో భద్రపరచుకోవాలని సూచించారు. ఇళ్లకు తాళాలు వేయడమే కాకుండా స్థానిక పోలీసులతో కలిసి ఎల్.హెచ్.ఎం.ఎస్ (లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం) సేవలు వినియోగించుకోవాలని సూచించారు. మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
దేవాలయాలే టార్గెట్


