గ్రేటర్‌పై ‘సమ్మిట్‌’ పోటు | - | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌పై ‘సమ్మిట్‌’ పోటు

Nov 13 2025 8:26 AM | Updated on Nov 13 2025 8:26 AM

గ్రేట

గ్రేటర్‌పై ‘సమ్మిట్‌’ పోటు

విశాఖలో 14, 15 తేదీల్లో

సీఐఐ భాగస్వామ్య సదస్సు

ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజ్‌

మైదానంలో ఏర్పాట్లు

సుందరీకరణ పనులకు పైసా కూడా

విదల్చని చంద్రబాబు ప్రభుత్వం

జీవీఎంసీపై రూ.42 కోట్ల భారం

విశాఖను పసుపుమయం చేసేసిన

అధికారులు

హడావుడిగా రోడ్‌ ప్యాచ్‌ వర్క్‌లు

విశాఖ సిటీ: గ్రేటర్‌పై సమ్మిట్‌ పోటు పడింది. సీఐఐ భాగస్వామ్య సదస్సు పేరుతో జీవీఎంసీపై చంద్రబాబు ప్రభుత్వం రూ.కోట్ల భారం మోపింది. ప్రతిష్టాత్మకంగా పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నట్లు డప్పులు కొట్టుకుంటున్న సర్కార్‌.. నిర్వహణకు మాత్రం పైసా కూడా విదల్చకుండా చేతులు దులుపుకుంది. దీంతో అరకొర పనులతోనే హడావుడిగా ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉంది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ మైదానంలో ఈ నెల 14, 15 తేదీల్లో 30వ సీఐఐ భాగస్వామ్య పెట్టుబడుల సదస్సు ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీనికి దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర వీఐపీలు ఇలా మొత్తంగా 3 వేల మంది హాజరవుతారని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో ఎప్పటిలాగే గత వైఎస్సార్‌ సీపీ హయాంలో జరిగిన ఒప్పందాలను కూడా తమ ఖాతాలో వేసుకొని రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ఊదరగొడుతోంది. ఈ సదస్సుకు విశాఖను సుందరంగా ముస్తాబు చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసేసింది. సదస్సు నిర్వహణకు గాని, విశాఖ సుందరీకరణకు గానీ రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా మంజూరు చేయకపోవడం గమనార్హం.

జీవీఎంసీపై రూ.42 కోట్ల భారం

ప్రభుత్వ ఆదేశాలతో జీవీఎంసీ అధికారులు విశాఖ సుందరీకరణపై దృష్టి పెట్టారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో జీవీఎంసీ ఖజానా నుంచే నిధులు వెచ్చిస్తున్నారు. నగరంలో కొత్త రోడ్లు కాకుండా ముందుగా గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఫుట్‌పాత్‌, డివైడర్లు, రైలింగ్‌ మరమ్మతులు చేశారు. అలాగే నగరానికి పుసుపు రంగు పులిమేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో డివైడర్లు, ఫుట్‌పాత్‌లు, రైలింగ్‌లకు తెలుపు, నలుపు రంగులు వేశారు. ఇప్పుడు తెలుపు రంగు స్థానంలో పసుపు రంగులు వేశారు. నగరాన్ని పసుపుమయంగా మార్చేశారు. ఈ సుందరీకరణ పనులకు సంబంధించి జీవీఎంసీ ఖజానాపై రూ.42 కోట్ల భారం పడినట్లు తెలుస్తోంది.

కొందరికే ఆహ్వానంపై అనుమానాలు

భాగస్వామ్య సదస్సులో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరుగుతాయని బాకాలు ఊదుతున్న ప్రభుత్వం ఈ సదస్సుకు కొందరినే ఆహ్వానించడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో చంద్రబాబు ఇదే తరహాలో పెట్టుబడుల సదస్సు పేరుతో రూ.కోట్లు ఖర్చు చేసి ఈవెంట్లు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో రోడ్డు మీద వ్యాపారాలు చేసుకుంటున్న వారిని కూడా బడా పారిశ్రామికవేత్తలుగా చూపించారు. ఎవరూ కనిపెట్టలేరన్న భ్రమలో వారికి సూటు, బూటు వేసి స్టేజ్‌ ఎక్కించారు. ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ఫొటోలకు పోజులిచ్చారు. వెంటనే ఆ ఒప్పందాలు చేసుకున్న నకిలీ పారిశ్రామికవేత్తల అసలు బండారం సోషల్‌ మీడియా ద్వారా బయటపడింది. దీంతో ఈసారి గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దిగ్గజ పారిశ్రామికవేత్తలు మినహా.. మిగిలిన ఒప్పందాలపై గోప్యత పాటించే అవకాశాలు ఉన్నట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఊరు, పేరు లేని ఉర్సా కంపెనీకి భూములు అప్పనంగా కట్టబెట్టిన వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. ఈ పెట్టుబడుల సదస్సులో ఒప్పందాల పేరుతో చంద్రబాబు ప్రభుత్వ పెద్దలు, వారి అనుచరులకు కారుచౌకగా భూముల పందారం జరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు విమర్శలు సంధిస్తున్నారు. దీని కారణంగానే ఈ సదస్సుకు కేవలం టీడీపీ శ్రేణులు, వారి అనుచరులను మాత్రమే ఆహ్వానిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నారు.

బీచ్‌ రోడ్డులో చేసిన ప్యాచ్‌ వర్క్‌లు

తుది దశకు ఏర్పాట్లు

ఈ నెల 14, 15 తేదీలలో ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ మైదానంలో జరిగే సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌కు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. సదస్సు కోసం జర్మన్‌ హ్యాంగర్లతో 8 హాళ్లు నిర్మించారు. దీనికి దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు సుమారు 3 వేల మంది హాజరవుతున్నట్లు భావిస్తున్నారు. అలాగే భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ చేతుల మీదుగా 14వ తేదీన సదస్సును ప్రారంభించనున్నారు. అలాగే దీనికి రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు హాజరుకానున్నారు. ఇందులో 30కి పైగా అవగాహన ఒప్పందాలు చేసుకుంటున్నట్లు మంత్రులు చెబుతున్నారు. విశాఖలో రెండు రోజుల పాటు జరిగే సదస్సులో 37 ప్లీనరీ సెషన్లు, ఐదు కంట్రీ సెషన్లు జరగనున్నాయి. ఈ సదస్సుకు పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. ఏయూ పరిసర ప్రాంతాలను నో డ్రోన్‌ జోన్‌గా ప్రకటించారు. ఏయూ ఇంజనీరింగ్‌ గ్రౌండ్‌తో పాటు వీఐపీలు పర్యటించే, బస చేసే హోటళ్ల వద్ద బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్లతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

గ్రేటర్‌పై ‘సమ్మిట్‌’ పోటు1
1/2

గ్రేటర్‌పై ‘సమ్మిట్‌’ పోటు

గ్రేటర్‌పై ‘సమ్మిట్‌’ పోటు2
2/2

గ్రేటర్‌పై ‘సమ్మిట్‌’ పోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement