ఈగల్ క్లబ్‌లతో విద్యార్థుల్లో అవగాహన
తుమ్మపాల: గంజాయికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్‌లో బుధవారం సాయంత్రం నిర్వహించిన జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశంలో ఆమెతో పాటు ఎస్పీ తుహిన్ సిన్హా పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్‌లను ఏర్పాటు చేసి, విద్యార్థుల్లో అవగాహన పెంచాలన్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ గంజాయి రవాణా నివారణకు ప్రత్యేక నెల రోజుల ప్రణాళిక రూపొందించామన్నారు. మొదటి వారంలో ప్రజల నుంచి సమాచారం సేకరణ, రెండో వారంలో సమాచారం వర్గీకరణ, మూడో వారంలో గంజాయి కార్యకలాపాలపై ప్రత్యేక ఆపరేషన్ల నిర్వహణ, నాలుగో వారంలో కమిటీ సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రధానంగా తాటిపర్తి, కోనాం, డౌనూరు, భీమవరం, శ్రీరాంపురం ప్రాంతాల్లో శాశ్వత చెక్‌పోస్టులతో పాటు 38 వాహన తనిఖీ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. అనకాపల్లిలోని ఎన్‌టీఆర్ జిల్లా ఆస్పత్రిలో 15 పడకలతో డీ–అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 116 కేసులు నమోదు చేసి, 382 మందిని అరెస్ట్ చేశామన్నారు. 8,504 కేజీల గంజాయి, 109 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ప్రజల భాగస్వామ్యంతోనే కుష్టు నిర్మూలన
కుష్టు వ్యాధి రహిత జిల్లా కోసం ప్రజల్లో అవగాహన పెంపు అవసరమని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. కుష్టు వ్యాధి కేసులను గుర్తించేందుకు ప్రభుత్వం తలపెట్టిన లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్(ఎల్‌సీడీసీ)–2025 ప్రొగ్రాం పోస్టర్‌ను బుధవారం కలెక్టరేట్‌లో ఆమెతో పాటు ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కా ర్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీ ఎంహెచ్‌వో ఎం.హైమావతి, డీఎల్‌ఏటీవో కె.స్వప్న, డీఐవో ఐ.చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.


