ఉగ్రవాద దాడులు ఎదురైతే.?
సింహాచలం: రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో ఉగ్రవాద దాడులు ఎదురైతే వాటిని సమర్థంగా తిప్పికొట్టేందుకు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆక్టోపస్ సిబ్బంది కళ్లకు కట్టినట్టు చూపించారు. స్వామి వారి ఆలయంలో మంగళవారం రాత్రి 9 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ మెగా మాక్ డ్రిల్‌ను నిర్వహించారు. ఉగ్రవాదులు ఆలయంలోకి చొరబడినట్టు సమాచారం అందగానే.. ఆక్టోపస్ అధికారులు వారిని మట్టుపెట్టేందుకు తుపాకీలు పట్టుకుని అనుసరించిన విధానాలు అబ్బురపరిచాయి. ఉగ్రవాదుల రూపంలో ఉన్న కొందరు ఆలయ పరిసరాల్లో మాటు వేయడం, వారిని మట్టుపెట్టేందుకు ఆక్టోపస్ సిబ్బంది గాలించిన వైనం ఆకట్టుకుంది. దేవస్థానం భద్రతా సిబ్బందితో పాటు గోపాలపట్నం పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక, ఆరోగ్య శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాల ప్రతినిధులు ఈ మాక్ డ్రిల్‌లో పాల్గొన్నారు. ఆక్టోపస్ డీఎస్పీ ఐ.తిరుపతయ్య, ఇన్‌స్పెక్టర్ శివాజీ నేతృత్వంలో ఈ మాక్ డ్రిల్ జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ తిరుపతయ్య మాట్లాడుతూ.. ఆలయాల్లో అత్యవసర పరిస్థితులు లేదా ఉగ్రవాద దాడులు జరిగితే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన విధానాలు, అన్ని శాఖల మధ్య సమన్వయం ఏర్పరచడమే ఈ మాక్ డ్రిల్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
అప్పన్న ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
ఉగ్రవాద దాడులు ఎదురైతే.?


