తాండవలో చేప పిల్లల విడుదల
నాతవరం: మత్స్యకారులను ఆదుకునేందుకు తాండవ రిజర్వాయర్‌లో చేప పిల్లలను విడుదల చేసినట్టు స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. తాండవ రిజర్వాయర్‌లో బుధవారం 10 లక్షల చేప పిల్లలను కలెక్టరు విజయకృష్ణన్‌తో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా తాండవ ప్రాజెక్టు నుంచి జాలరిపేటకు వెళ్లే మట్టిరోడ్డును అభివృద్ధి చేయాలని మత్స్యకారులు, తాండవ ప్రాజెక్టు పరిధిలో ఏలేరు, తాండవ కాలువలు దెబ్బతిన్నాయని, వాటి మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కరక సత్యనారాయణ కోరారు. స్పీకరు అయ్యన్న మాట్లాడుతూ నాతవరం నుంచి తాండవ ప్రాజెక్టు మధ్య రోడ్డు నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా రూ 6.36 కోట్లతో ప్రతిపాదనలు చేశామన్నారు, ప్రభుత్వం వద్ద నిధులు లేవని చెప్పారు. సీఎస్‌ఆర్ నిధులతో రోడ్డు అభివృద్ధికి కలెక్టర్ కృషి చేయాలని తెలిపారు. అనంతరం ఎం.బి. పట్నం పంచాయతీ శివారు ఎ.శరభవరం వద్ద ఏలేరు కాలువ నీటిని పైపులైను ద్వారా నక్కపల్లిలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలకు తరలించేందుకు కావలసిన భూమిని పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టరు రాజాన సూర్య చంద్ర, మత్స్యశాఖ జేడీ పి.లక్ష్మణరావు, డీడీ పి.విజయ, నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ, తాండవ ప్రాజెక్టు అధికారులు కె.సత్యనారాయణ, అనురాధ, తహసీల్దార్ ఎ.మహేష్ ఎంపీడీవో శ్రీనివాస్, తాండవ మత్స్యశాఖ అధికారి నాగమణి పాల్గొన్నారు.


