గంటల తరబడి ట్రాఫిక్ జామ్
రోడ్డు మధ్యలో ట్రాలర్ బోల్తా
గాజువాక: షీలానగర్ జంక్షన్ జాతీయ రహదారి మధ్యలో ట్రాలర్ బోల్తా పడింది. దీంతో ఆ ట్రాలర్‌పై గల కంటైనర్లు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయిపోయి జనం అవస్థలు పడ్డారు. అచ్యుతాపురం నుంచి విశాఖ పోర్టుకు కంటైనర్లను తీసుకెళ్తున్న ఒక ట్రాలర్ షీలానగర్ నుంచి పోర్టు రోడ్‌లోకి మలుపు తిరుగుతుండగా బోల్తా పడిపోయింది. దీంతో దానిపైగల కంటైనర్లు కిందపడిపోయి ట్రాఫిక్‌కు ఆటంకంగా మారాయి. బుధవారం తెల్లవారుజాము 5.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో హైవేపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే ఉదయం 7 గంటల సమయంలో హైవేపై ఒక్కసారిగా వాహనాలు పెరిగాయి. అదే సమయంలో ట్రాలర్‌ను తొలగించడానికి సంబంధిత కంపెనీ ప్రతినిధులను నాలుగు క్రేన్లను అక్కడికి తీసుకురావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అటువైపు షీలానగర్ నుంచి ఎయిర్ పోర్టువరకు, ఇటువైపు గాజువాక ఆటోనగర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఆ సమయంలో జాతీయ రహదారిపై వెళ్లాలనుకొనేవారు గంటల తరబడి అవస్థలను ఎదుర్కొన్నారు. చివరకు కంటైనర్లను తొలగించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.


