మనస్తాపంతో సీపీఐ జిల్లా కార్యదర్శి ఆత్మహత్య
నర్సీపట్నం: సీపీఐ అనకాపల్లి జిల్లా కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు(53) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం..ఆయన స్వస్థలం గొలుగొండ మండలం చోద్యం గ్రామం. ప్రస్తుతం నర్సీపట్నం బ్యాంక్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన కుమారుడు మూడు నెలల క్రితం మరణించాడు. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనతో బాధపడుతున్న రామునాయుడు బుధవారం గడ్డి మందు తాగారు. గమనించిన కుమార్తె లోచత వెంటనే చుట్టు పక్కల వారి సాయంతో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. రామునాయుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామునాయుడు సీపీఐ గొలుగొండ మండల సెక్రెటరీగా రెండు పర్యాయాలు, ఉమ్మడి జిల్లా ప్రజానాట్యమండలి అధ్యక్షుడిగా, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శిగా, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం సీపీఐ జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నారు. భార్య సత్యవేణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురువారం రామునాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బంధువులు తెలిపారు.


