వడ్డాదిలో పిచ్చి కుక్క స్వైర విహారం
బుచ్చెయ్యపేట: వడ్డాదిలో ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. సుమారు 20 మందితో పాటు పలు పశువులు, నాటుకోళ్లపై దాడి చేసి గాయపరిచింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు వడ్డాదిలో పలు వీధుల్లో తిరుగుతూ ఎదురుపడిన వారిపై విచక్షణారహితంగా దాడి చేసింది. పి.వెంకటరత్నం, డి.అచ్చియమ్మ, టి.ధనశ్రీ, కండెల్లి నూకరత్నం, పి.వెంకటరమణ, ఎ.సత్యవతి, జి.రామకృష్ణ, టి.అప్పారావు, సాకేత్ కుమార్, శ్రీను తదితరులు 20 మందికి పైగా కుక్క దాడిలో గాయపడ్డారు. వడ్డాది ప్రభుత్వ ఆస్పత్రిలో 15 మందికి వైద్యాధికారి దుర్గ రమ్య, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీను, వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు చేసి, రేబిస్ వ్యాక్సిన్ వేశారు. వీరిలో తీవ్రంగా గాయపడిన పలువురిని రెండు 108 వాహనాల్లో చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి జనరల్ చెకప్‌కు, చిన్న పిల్లల వైద్యుల వద్దకు తరలించారు. గాయపడిన పశువులు, మేకలను బాధిత రైతులు వడ్డాది పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. వీధి కుక్కలతో రాత్రిపూట వీధుల్లో తిరగాలంటేనే భయపడుతున్నామని, నివారణకు తక్షణం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కుక్క దాడిలో గాయపడ్డ బాలిక ధనశ్రీ, వృద్ధురాలు
వడ్డాదిలో పిచ్చి కుక్క స్వైర విహారం
వడ్డాదిలో పిచ్చి కుక్క స్వైర విహారం


