భర్త వేధింపులకు బలైన ఆర్కిటెక్ట్ డిజైనర్
వివాహిత ఆత్మహత్య
ఏడాది క్రితం వివాహం
భర్త మానసిక వేధింపులే కారణమని సూసైడ్ నోట్
రామకృష్ణానగర్‌లో ఘటన
అల్లుడే హత్య చేశాడని
తల్లిదండ్రుల ఫిర్యాదు
గోపాలపట్నం: వివాహమై ఏడాది కాకముందే దేశంశెట్టి విజయ శ్యామల (25) అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణానగర్‌లో చోటు చేసుకుంది. భర్త పెట్టిన మానసిక వేధింపులే ఈ బలవన్మరణానికి కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గోపాలపట్నం సీఐ సన్యాసి నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పుతూరు గ్రామానికి చెందిన విజయ శ్యామలకు 2024 డిసెంబర్ 6న చోడవరం మండలం గోవాడ గ్రామానికి చెందిన దేవాడ దిలీప్ శివకుమార్‌తో వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ. 5 లక్షల కట్నం, ఎకరా భూమి, రూ. 1.60 లక్షల విలువైన ద్విచక్ర వాహనం, 8 తులాల బంగారం, ఆడపడుచు కట్నం రూ.లక్ష, సారె ఇచ్చామని శ్యామల తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఎన్‌ఎస్టీఎల్‌లో ఆర్కిటెక్చర్ డిజైనర్‌గా పనిచేస్తున్న శ్యామల ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చింది. భర్త దిలీప్ శివకుమార్ తరచుగా ఆమెకు దూరంగా ఉంటూ, ఇతరులతో పోల్చుతూ ద్వేషిస్తూ మానసికంగా వేధించేవాడని తెలుస్తోంది. ఆదివారం రాత్రి 11 గంటల తరువాత ఆమె ఉరి వేసుకుంది. అదే సమయంలో ఇంటికి వచ్చిన దిలీప్ శివకుమార్ తలుపు కొట్టినా తీయకపోవడంతో విరగ్గొట్టి వెళ్లి చూడగా, శ్యామల ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే కిందకి దించి, తన అన్నావదినలకు సమాచారం అందించాడు. వారు వచ్చిన తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన జరిగిన విధానంపై ఆరా తీశారు. సోమవారం ఉదయం ఏసీపీ పృధ్వీతేజ ఘటనా స్థలికి చేరుకుని మృతురాలి బంధువులతో మాట్లాడారు. సూసైడ్ నోట్‌లో పేర్కొన్న అంశాలను బట్టి, భర్త తనను పూర్తిగా దూరం పెట్టడం, అర్ధరాత్రి ఇంటికి రావడం, శారీరకంగా, మానసికంగా దూరం పెడుతున్న కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
అల్లుడే చంపేశాడు
మృతురాలి తల్లిదండ్రులు దేశంశెట్టి రోజారమణి మాట్లాడుతూ తమ కుమార్తెను అల్లుడే చంపేశాడని ఆరోపించారు. తమ కూతురు చనిపోయిన తర్వాత తమకు సమాచారం ఇవ్వకుండా, అన్నావదినలకు సమాచారమందించడం, వారు వచ్చిన తరువాత పోలీసులకు చెప్పడం ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని ఆరోపించారు. ఎకరా భూమి గురించి పలుమార్లు అల్లుడు ఫోన్ చేసి అడిగేవాడని తల్లి రోజారమణి ఆరోపించారు. తమ కూతురిని వారే పొట్టన పెట్టుకున్నారని, వారికి తగిన శిక్ష వేయాలని రోదించారు. ఎయిర్‌పోర్ట్ సీఐ శంకరనారాయణ, ఎస్‌ఐ అప్పలనాయుడు ఘటనకు గల కారణాలను ఆరా తీశారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. తల్లి రోజారమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


