యువకుడి మృతి కేసులో నలుగురు అరెస్ట్
యలమంచిలి రూరల్: స్వల్ప వివాదం కాస్త ముదిరి కొట్లాటకు దారితీసిన ఈ ఘటనలో ఒకరి ప్రాణాలు బలిగొనగా, నలుగురు యువకులు జైలుపాలయ్యారు. పట్టణంలోని గత నెల 25వ తేదీ రాత్రి నాగుల చవితి జాతరలో ఆటో డ్రైవర్‌పై దాడికి పాల్పడి అతని మృతికి కారణమైన నలుగురు నిందితులను పట్టణ పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. గత నెల 26న తొలుత కొట్లాట కేసుగా నమోదు చేసిన పోలీసులు కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ నెట్టి శివ(35) ఆదివారం మృతి చెందడంతో సెక్షన్లు మార్పు చేశారు. ఈ కేసుకు సంబంధించి యలమంచిలి సీఐ ధనుంజయరావు సోమవారం రాత్రి స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్‌లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్థానిక టిడ్కో కాలనీకి చెందిన శివ ఇద్దరు స్నేహితులతో కలిసి యలమంచిలి పట్టణంలోని నాగుల చవితి జాతర చూడ్డానికి వెళ్లాడు. సీతా తులసీ సినిమాహాళ్ల వద్దకు చేరుకున్న సమయంలో నెట్టి శివ భుజం ఎదురుగా వస్తున్న పట్టణానికి చెందిన ఓ యువకుడికి తగిలింది. దీంతో శివకు పట్టణంలో ధర్మవరంకు చెందిన వెదుళ్ల మోహన్, కశింకోట గువ్వాలు, కొఠారు రవితేజ(రవి), గొన్నాబత్తుల విఘ్నేష్‌లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గొడవ పెరుగుతున్న సమయంలో శివ నలుగురు యువకులకు సారీ సైతం చెప్పాడు. అయినప్పటికీ శాంతించని యువకులు శివపై విచక్షణారహితంగా దాడి చేయడంతో అక్కడున్న సిమెంట్ రోడ్డుపై పడిపోయాడు. అనంతరం శివ ముఖంపై పిడి గుద్దులు గుద్దిన నలుగురు యువకులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. తల, ఇతర శరీర భాగాలకు గాయాలైన శివను అతని స్నేహితులు టిడ్కో గృహ సముదాయంలో ఇంటికి తీసుకెళ్లారు. శివ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కుటుంబ సభ్యులు యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా ప్రథమ చికిత్స అనంతరం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. శివను పరీక్షించిన అక్కడి వైద్యులు మరింత మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. 15 రోజులుగా చికిత్స పొందిన శివ ఆదివారం ఉదయం మృతి చెందాడు. ఈ ఽఘటనపై శివ కుటుంబసభ్యులు యలమంచిలి పట్టణ పోలీసులకు ఆదివారం మరో ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు మొదట బీఎన్‌ఎస్ 117(2),115(2) రెడ్ విత్3(5) కింద నమోదైన కేసు సెక్షన్లను బీఎన్‌ఎస్ 105 రెడ్ విత్ 3(5) గా మార్పు చేశారు. నలుగురు నిందితులకు సోమవారం రాత్రి యలమంచిలి సీహెచ్‌సీలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు.
నాగుల చవితి జాతరలో
దాడి చేసిన నిందితులు


