ఫీజుల విడుదలకు ఐక్య పోరాటం
యలమంచిలి రూరల్: రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలపై దశలవారీగా పోరాటం చేయనున్నట్టు రాష్ట్ర ప్రైవేటు డిగ్రీ కళాశాలల సంఘం అధ్యక్షుడు జె.రమణాజీ తెలిపారు. సోమవారం రాత్రి యలమంచిలి కేబీఆర్ డిగ్రీ కళాశాలలో జిల్లా ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఐక్య పోరాటం ద్వారా ఒత్తిడి తెస్తామన్నారు. త్వరలోనే విజయవాడలో అన్ని కళాశాలల యాజమాన్యాల సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఫీజు బకాయిల కారణంగా కళాశాలల యాజమాన్యాలు అనేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాయన్నారు. కొన్ని కళాశాలల యాజమాన్యాలు సొంత ఆస్తులు, బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్న పరిస్థితి ఉందన్నారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం 100 ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. తొలిసారిగా ఉత్తరాంధ్ర నుంచి రాష్ట్ర ప్రైవేటు డిగ్రీ కళాశాలల సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికై న జెర్రిపోతుల రమణాజీని పలువురు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏయూ పరిధి ప్రైవేటు డిగ్రీ కళాశాలల సంఘం అధ్యక్షుడు పైడా కృష్ణప్రసాద్, కార్యదర్శి రామారావు, జిల్లా ప్రైవేటు డిగ్రీ కళాశాలల అధ్యక్షుడు గోవిందరావు, సంఘం పాలకవర్గ సభ్యుడు నాగేశ్వర్రావు, పలు డిగ్రీ కళాశాలల యజమానులు పాల్గొన్నారు.


