సెయింట్ కనకదాస జయంతి
సెయింట్ కనకదాస చిత్రపటం వద్ద
నివాళులర్పించిన డీఆర్వో సత్యనారాయణరావు
తుమ్మపాల: ప్రముఖ భక్తకవి, తత్వవేత్త సెయింట్ కనకదాస సమాజంలో సమానత్వం, సేవా భావం, భక్తి మార్గాన్ని ప్రజలకు చూపిన మహానుభావుడని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అన్నారు. ఆయన జయంతి వేడుకలను శనివారం ఉదయం కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ కనకదాసు గురించి నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన ఆలోచనలు ఈనాటి తరానికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆయన తన రచనల ద్వారా కుల వ్యవస్థ, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి, ప్రజలలో సమానత్వం కోసం కృషి చేశారన్నారు. ఆయన కేవలం కవి మాత్రమే కాదు, యోధుడు, సంగీతకారుడు తత్వవేత్త అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీదేవి, బీసీ సంఘ నాయకులు, హాస్టల్ సంక్షేమాధికారులు పాల్గొన్నారు.


