నిబంధనలకు విరుద్ధంగా ఏపీఐఐసీకి భూమి అప్పగింత!
నాతవరం: ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూసేకరణ జరపకుండా, రైతుల అంగీకారం లేకుండా రెవెన్యూ అధికారులు వాటర్ ప్లాంటు నిర్మాణం కోసం భూమిని ఏపీఐఐసీ అధికారులకు అప్పగించడం భావ్యం కాదని రైతులు శనివారం అవేదన వ్యక్తం చేశారు. నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేస్తున్న పలు పరిశ్రమలకు నాతవరం మండలం మీదుగా ప్రవహిస్తున్న ఏలేరు కాలువ నీటిని పైపులైను ద్వారా తరలించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు తరలించేందుకు రూ.340 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో వాటర్ ప్లాంటు నిర్మించేందుకు ఎం.బి.పట్నం పంచాయతీ శివారు ఎ.శరభవరం గ్రామం వద్ద ఏలేరు కాలువను అనుకొని రెండెకరాలు భూమి అవసరమైంది. భూ సేకరణ కోసం రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి కొందరు రైతుల నుంచి భూమి అంగీకారం తీసుకున్నారు. మరికొందరు రైతులు అక్కడున్న మార్కెట్ రేటు కంటే తక్కువగా ఇవ్వలేమని భీష్మించారు. ఇటీవల కాలంలో ఈ భూమిని అనుకుని క్రయ విక్రయాలు జరిగాయని, ఆ విధంగా రేటు ఇస్తే భూమి ఇస్తామన్నారు. తమకు ఈ భూమి తప్ప మరెక్కడా భూములు లేవని రైతులు ప్రసాద్, పైల సత్యం, ఉమామహేశ్వరరావు తదితరులు అధికారుల వద్డ గోడు వినిపించారు. అయితే ప్రభుత్వ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు రైతులను భయపెట్టి భూములు బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, రైతులు పైల సత్యం, కర్రి ప్రసాద్, కర్రి ఉమా మహేశ్వరరావు, పెదిరెడ్ల రమణమ్మ హైకోర్టును ఆశ్రయించారు. ఈ భూమికి సంబంధించి హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా శనివారం తహసీల్దార్ ఎ.వేణుగోపాల్, సర్వేయరు విజయకుమార్, వీఆర్వో సత్తిబాబు స్వయంగా దగ్గరుండి భూమిని ఏపీఐఐసీ వారికి అప్పగించారు. రెవెన్యూ అధికారులు అప్పగించిన సరిహద్దు ప్రకారం ఆ భూమి చుట్టూ ఏపీఐఐసీ అధికారులు జెండాలు వేసి వాటర్ ప్లాంటు నిర్మించేందుకు మార్కింగ్ పనులకు సిద్ధపడ్డారు. 2018 భూసేకరణ ప్రకారం రేటు ఇస్తే కుదరదని, 2025 సంవత్సరం భూసేకరణ ప్రకారం భూమికి రేటు ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా మా భూమిలో బలవంతంగా అధికారులు జెండాలు ఏర్పాటు చేశారన్నారు. ఈ విషయంపై తహసీల్దార్ వేణుగోపాల్ మాట్లాడుతూ కలెక్టరు ఆదేశాల ప్రకారమే తాము రైతులకు న్యాయం చేస్తామన్నారు. కొందరు రైతులు స్వంతంగా భూమి ఇచ్చారని, కొందరు మాత్రం రేటు అధికంగా కావాలంటున్నారని, అది తమ పరిధిలో లేదన్నారు. రైతులు స్వయంగా ఇచ్చిన భూమిలో ఒక జెండా, భూమి ఇవ్వని రైతుల భూమిలో రెండో రకం జెండా వేశామన్నారు. తాము ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా పనులు చేస్తున్నామన్నారు.
ఎ.శరభవరం వద్ద వాటర్‌ప్లాంట్
నిర్మాణానికి భూసేకరణ
మార్కెట్ ధర ఇస్తేనే
భూములిస్తామంటున్న రైతులు
హైకోర్టులో కేసు ఉండగా అధికారులు ఆ భూముల్లో జెండాలు పాతడంపై ఆవేదన
నిబంధనలకు విరుద్ధంగా ఏపీఐఐసీకి భూమి అప్పగింత!


