సమాజానికి సందేశాన్నిచ్చే సినిమాలు రావాలి
● వైఎస్సార్‌సీపీ నాయకుడు బొడ్డేడ ప్రసాద్
● మునగపాకలో ఘనంగా
‘మాఊరి వెంకన్న’ప్రీరిలీజ్ ఫంక్షన్
● ఈ నెల 14న విడుదల కానున్న చిత్రం
మునగపాక: సమాజానికి మంచి సందేశాన్నిచ్చే సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ అన్నారు. మునగపాకకు చెందిన పురోహితుడు వెలవలపల్లి కోటేశ్వరశర్మ నిర్మాతగా రూపొందించిన మాఊరి వెంకన్న చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో భాగంగా శనివారం స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో గవర కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మళ్ల సురేంద్రతో కలిసి ఆయన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుడూ శ్రీయజ్ఞ ప్రొడక్షన్‌పై స్థానిక కళాకారుడైన కోటేశ్వరశర్మ నిర్మాతగా చిత్రీకరించిన మాఊరి వెంకన్న చిత్రం విజయవంతం కావాలని ఆకాక్షించారు. మంచి సినిమాలు తీయాలన్న తపన కోటేశ్వరశర్మతో పాటు చిత్ర దర్శకుడు కోరుకొండ గోపీకృష్ణలో ఉందన్నారు. చిత్ర దర్శకుడు గోపీకృష్ణ మాట్లాడుతూ మునగపాక గ్రామం కళారంగానికి ముద్దుబిడ్డగా చెబుతుంటారన్నారు. అటువంటి గడ్డపై కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి పేరిట మాఊరి వెంకన్న సినిమా తీయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాకు మునగపాకలో నిర్మిస్తున్న వెంకన్న ఆలయమే స్ఫూర్తిగా ఆయన పేర్కొన్నారు. ఈ నెల 14న రెండు తెలుగు రాష్ట్రాల్లో మాఊరి వెంకన్న చిత్రం విడుదలవుతుందన్నారు. మునగపాక ఎంపీటీసీ సూరిశెట్టి రాము అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ దిమ్మల అప్పారావు, జెడ్పీటీసీ పెంటకోట స్వామి సత్యనారాయణ, శ్రీధర్మ ఫౌండేషన్ చైర్మన్ కర్రి సాయి కృష్ణ, డాన్ జిమ్ అధినేత పెంటకోట విజయ్, పెద్దలు దాడి ముసిలినాయుడు, డాక్టర్ బద్దెం సూర్యనారాయణ, కాండ్రేగుల జగ్గారావు, ఎంపీటీసీ–3 బోడకుర్తి గణేష్, తదితరులు పాల్గొన్నారు.


