ఆచరణతో పిల్లల్లో విలువలు ఏర్పాలి
పాయకరావుపేట: శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల్లో గత 5 రోజులుగా నిర్వహిస్తున్న రిమ్ జిమ్ కార్యక్రమం ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి అతిథిగా ది హిందూ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ ఆర్నాల హాజరై విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. పిల్లలతో విలువల గురించి మాట్లాడడం కాదని, వాటిని ఆచరించడం నేర్పించాలని శ్రీధర్ ఆర్నాల అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల తుని, పాయకరావుపేట, అన్నవరం విద్యార్థులు సుమారు 5500 మందికి సాహిత్యం, సంగీతం, ఆటలు, క్రీడలు, లలిత కళలు, థియేటర్ ఆర్ట్స్, సైన్స్ వంటి అనేక అంశాల మీద 31 రకాల పోటీలు నిర్వహించి శ్రీధర్ ఆర్నాల, జేఎన్‌టీయు వైస్ ప్రిన్సిపాల్ డా జి.వి.ఎస్.ఆర్ దీక్షితులు విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చర్చావేదికలో కృత్రిమ మేధస్సు – తెలివైన సాధనమా లేక ప్రమాదకరమైన ధోరణా? అనే అంశంపై బాల అతిథులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. డా. దీక్షితులు మాట్లాడుతూ వేగవంతమైన సాంకేతిక పురోగతి కారణంగా ప్రపంచ పోకడలు మారుతున్నాయని, కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రతి ఒక్కరూ మెరుగుపరచుకోవాలని తెలిపారు. విద్యార్ధులు ఉపాధ్యాయుల నుంచి పొందే ప్రేరణ వెల కట్టలేనిదని అన్నారు. విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్ధిలోనూ దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, ఉన్నత స్ధానానికి తీసుకువెళ్లాడానికి ఇటువంటి పోటీల్లో వచ్చిన విజయాలు ప్రేరణ ఇస్తాయని తెలిపారు. అనంతరం అతిథులకు జ్ఙాపికలు బహుకరించారు. విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సీనియర్ ప్రిన్సిపాల్ మూర్తి, రిమ్ జిమ్ కన్వీనర్ నీలాదేవి పాల్గొన్నారు.
శ్రీ ప్రకాష్‌లో ముగిసిన రిమ్ జిమ్ వేడుకలు


