అక్రమంగా గ్రావెల్, ఇసుక తవ్వకాలు
● ఎన్‌ఆర్‌ఐ ఫిర్యాదుపై
స్పందించిన అధికారులు
● పొక్లెయిన్, ట్రాక్టర్ స్వాధీనం,
కేసు నమోదు
నాతవరం: నిబంధనలు ఉల్లఘించి ఎలాంటి అనుమతులు లేకుండా ఏలేరు కాలువ గట్టుపై ప్రభుత్వ భూమిలో ఆక్రమ తవ్వకాలు చేస్తుండడంపై చెర్లోపాలెం గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ లెక్కల వెంకటేశ్వరరావు ఫిర్యాదుపై అధికారులు చర్యలు చేపట్టారు. మండలంలో చెర్లోపాలెం పంచాయతీని ఇదే గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ లెక్కల వెంకటేశ్వరరావు దత్తత తీసుకుని గత కొన్నేళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ పంచాయతీలో ఉన్న ఏలేరు కాలువ గట్టుపై ప్రభుత్వ భూమిలో గ్రావెల్ ఇసుక మట్టి కొందరు ప్రోత్సాహంతో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. పొక్లెయియిన్‌తో రాత్రి పగలు అనే తేడా లేకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరుంచి తవ్వకాలు చేసి వ్యాపారం చేస్తున్నారు. ట్రిప్పర్లు, ట్రాక్టర్లతో రవాణా చేయడంతో రోడ్లు దెబ్బతింటున్నాయి. ఈ విషయంపై గ్రామంలో పలువురు లెక్కల వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్వయంగా పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులు ,పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. ఆయా శాఖలు అధికారులు సంయుక్తంగా దాడులు చేయగా పొక్లెయిన్, ట్రాక్టరు పట్టుబడడంతో పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ విషయంపై నాతవరం ఎస్.ఐ వై.తారకేశ్వరరావును వివరణ కోరగా వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదుపై పొక్లెయిన్, ట్రాక్టర్ స్వాధీనం చేసుకుని తవ్వకందారులపై కేసు నమోదు చేశామన్నారు. ఆ ప్రాంతంపై ప్రత్యేక నిఘా పెడతామన్నారు.
ఏలేరు కాలువ గట్టుపై తవ్వకాలు జరిపిన ప్రదేశం
ప్రభుత్వ భూమిలో ఇసుక తవ్విన ప్రాంతం
అక్రమంగా గ్రావెల్, ఇసుక తవ్వకాలు


