ఫోర్జరీ పత్రాలతో రిజిస్ట్రేషన్లపై ఫిర్యాదు
తుమ్మపాల: చనిపోయిన వ్యక్తి పేరున గల స్థలాన్ని ఫోర్జరీ పత్రాలతో ఇతరులకు అమ్మివేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతుని కుమారుడు మళ్ల సాగర్ బుధవారం జిల్లా రిజిస్ట్రార్ మన్మధరావుకు ఫిర్యాదు చేశారు. జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలో రాజుపాలెం సర్వే నెం. 93/25, 94లో గల లే–అవుట్లో ప్లాట్ నెం.15, 16, 17 మొత్తం 956 గజాల స్థలాన్ని 1985 ఏడాదిలో మళ్ల శివ వెంకటకృష్ణ కోనుగోలు చేశారని, 2008లో ఆయన మరణించినప్పటికి 2010 ఫిబ్రవరి 1న లంకెలపాలెం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో క్రయ దస్తావేజు నెం.298/2010తో మూడు ప్లాట్‌లను తన తండ్రి విక్రయించినట్టు ఫోర్జరీ పత్రాలతో ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారన్నారు. దీంతో తీవ్రంగా నష్టపోయిన తమకు న్యాయం చేసి మోసానికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, దొంగ దస్తావేజులు రద్దు చేయాలని కోరారు.


