17 నుంచి కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే
మహారాణిపేట: జిల్లాలో ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు కుష్టు వ్యాధిని గుర్తించే కార్యక్రమం(ఎల్‌సీడీసీ) పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. కుష్టు వ్యాధి సర్వేకు సంబంధించి కలెక్టర్ చాంబర్‌లో బుధవారం జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఆశ కార్యకర్తలు, పురుష వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పూర్తిస్థాయి సర్వే నిర్వహించాలని సూచించారు. ఎవరికై నా తమ శరీరంపై స్పర్శ లేని మచ్చలు ఉన్నట్లయితే ఇంటికి వచ్చే వైద్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. ప్రాథమిక స్థాయిలోనే మచ్చలను గుర్తిస్తే అంగ వైకల్యం రాకుండా, ఇతరులకు వ్యాపించకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. సర్వే సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు. జిల్లా కుష్టు, క్షయ, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ రమేష్, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, సాంఘిక సంక్షేమ ఉప సంచాలకులు రామారావు, నోడల్ అధికారి డాక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.


