
అవతరణ దినోత్సవంపై భేషజాలు వీడండి
మద్దిలపాలెం: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న అధికారికంగా నిర్వహించాలని తెలుగుదండు డిమాండ్ చేసింది. ఈ మేరకు మద్దిలపాలెం కూడలిలోని తెలుగుతల్లి విగ్రహం వద్ద ఆదివారం నిరసన జరిగింది. తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు ఫణిశయన సూరి నేతృత్వంలో సాహితీవేత్తలు తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ముఖ్యమంత్రికి బహిరంగ లేఖను విడుదల చేశారు. ‘ఈ ఏడాది నుంచైనా నవంబరు 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి. తెలంగాణ విడిపోయినా, నవంబర్ 1వ తేదీ యథావిధిగా మన రాష్ట్ర అవతరణ దినోత్సవమే. దీనిపై భేషజాలకు పోకుండా అవతరణ దినోత్సవాన్ని జరిపించాలి.’అని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే, అధికార భాషా సంఘం స్థానంలో మాతృభాషాభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలని ఫణిశయన సూరి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ప్రసాద్, చిన్న సూర్యనారాయణ, అడపా రామకృష్ణ, రాజమన్నార్, హేమ, ఉండవిల్లి సుజాత, ప్రజా గాయకుడు దేవీశ్రీ తదితర సాహితీవేత్తలు, కవులు పాల్గొన్నారు.