
ట్రాక్టరు కింద పడి యువకుడు దుర్మరణం
కోటవురట్ల: ట్రాక్టరు బోల్తాపడి మీద పడిన ఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ రమేష్ తెలిపిన వివరాలివి. గొలుగొండ మండల కసిమి గ్రామానికి చెందిన చిన్ని లక్ష్మణరావు (27) మండలంలోని పాములవాకలో కుంచా కన్నబాబుకు చెందిన జీడితోటను లీజుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో జీడితోటలో దుక్కిపనులను శుక్రవారం ప్రారంభించారు. అదే గ్రామానికి చెందిన అల్లు నాగసత్య ట్రాక్టరుతో దుక్కిపనులు నిర్వహించి సాయంత్రం ఇంటికి వెళ్లిపోతుండగా అదే ట్రాక్టరుపై చిన్ని లక్ష్మణరావు కూర్చుని వెళుతుండగా నీలిగుంట సమీపంలోని తాండవా కాలువను దాటుతుండగా ట్రాక్టరు బురదలో ఇరుక్కుపోయింది. బయటకు తీసే ప్రయత్నంలో ట్రాక్టరు తిరగబడి దాని కింద చిన్ని లక్ష్మణరావు ఇరుక్కుపోయాడు. పొట్టలోకి ఇనుప రాడ్ దిగిపోవడంతో పాటు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి నర్సీపట్నం ఏరియా అస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రాత్రి మృతి చెందాడు. ఈ విషయమై చిన్ని లక్ష్మణరావు తండ్రి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.