
ఆరోగ్యకర జీవనానికి దిక్సూచి ఆయుర్వేదం
ప్రముఖ ఆయుర్వేద వైద్యులు
కన్నాలయం గోపాలన్ రవీంద్రన్
పాయకరావుపేటలో ఘనంగా ధన్వంతరి హోమం
పాల్గొన్న ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు
పాయకరావుపేట: ఆయుర్వేద వైద్యం మన పూర్వీకులు మనకు ఇచ్చిన గొప్ప సంపద అని, ఆయుర్వేదం మనిషి ఆరోగ్యకరమైన జీవన విధానానికి దారిచూపే ఒక దిక్సూచి అని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ కన్నాలయం గోపాలన్ రవీంద్రన్ అన్నారు. ఆయుర్వేద మూల పురుషుడు ధన్వంతరి జయంతి, జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల్లో శ్రీ ప్రకాష్ ఆయుష్ చారిటబుల్ అండ్ రిసెర్చ్ ట్రస్టు వ్యవస్థాపకులు సిహెచ్.కె.నరసింహారావు, రామసీత దంపతులతో వేదపండితుల శాస్త్రోక్తంగా ధన్వంతరి హోమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ కన్నాలయం గోపాలన్ రవీంద్రన్, ప్రముఖ ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో డాక్టర్ కన్నాలయం గోపాలన్ రవీంద్రన్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలు కూడా నేడు ఆయుర్వేద వైద్య ఆవశ్యకతను గుర్తించి ఆయుర్వేదానికి ప్రాధాన్యం ఇస్తున్నాయన్నారు. అనంతరం విద్యా సంస్ధల్లో ఉన్న ఆయుర్వేద వైద్యాలయాన్ని సందర్శించారు. ప్రముఖ ప్రవచనకర్త, ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు చేతుల మీదుగా ఆయుర్వేద వైద్యులు కన్నాలయం గోపాలన్ రవీంద్రన్‌ను ఘనంగా సన్మానించారు.
పుస్తకమే నిజమైన గురువు
మరొక ముఖ్య అతిథి ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు చరిత్ర కలిగిన మేధావుల జీవిత చరిత్రలను చదవాలని, తద్వారా మంచి క్రమశిక్షణ అలవడుతుందన్నారు. మాజీ రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, సర్వేపల్లి రాధాకృష్ణన్, స్వామి వివేకానంద, మహ్మాతాగాంధీ, అబ్రహం లింకన్ వంటి మహానీయుల జీవిత గాథలు చదివినట్టయితే విద్యార్థులకు చదువుతోపాటు మంచి నడవడిక కలుగుతుందన్నారు. ప్రతి విద్యార్థి, ప్రతి వ్యక్తి కూడా విద్యతో పాటు క్రమశిక్షణ, మంచి నడవడిక అలవర్చుకోవాలన్నారు. పుస్తకమే నిజమైన గురువని వి ద్యార్థులకు దిశనిర్దేశం చేశారు. అనంతరం చాగంటి కోటేశ్వరరావును విద్యాసంస్థల కరస్పాండెంట్, సెక్రటరీ నర్సింహరావు, జాయింట్ సెక్రటరీ విజయ్ ప్రకాష్ పూలమాల వేసి, పుస్తకాలను అందించి సత్కరించారు. కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యాలయం ట్రస్టు డాక్టర్ యు.ఇందూలాల్, ఆయుర్వేద చికిత్సాలయ సలహాదారుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్, ప్రధాన వైద్యులు డాక్టర్ టి.రమేష్‌బాబు, డాక్టర్ ఎం.ఏసయ్య, ఆయుర్వేద ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

ఆరోగ్యకర జీవనానికి దిక్సూచి ఆయుర్వేదం