
దివాళీ ధోకా
ఏయూ మైదానంలో బాణసంచా స్టాళ్ల
అనుమతుల్లో గందరగోళం
ఎన్నడూ లేని విధంగా
రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ జోక్యం
14 నుంచి పనులు చేపట్టినా,
16న అనుమతులు మంజూరు
పోలీస్ అనుమతులు లేకుండానే
స్టాళ్ల ఏర్పాటు
విశాఖ సిటీ: ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో బాణసంచా స్టాళ్ల అనుమతుల వ్యవహారం రచ్చకు దారితీసింది. ఎప్పుడూ లేని విధంగా దుకాణాల లీజు అంశం దుమారం రేపింది. ఈ విషయంలో ఏకంగా రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ జోక్యం చేసుకోవడం వర్సిటీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించడం, ఆ తర్వాత అనుమతుల కోసం కలెక్టర్ ఉన్నత విద్యా శాఖకు లేఖ రాయడం, అనంతరం అనుమతులు ఇవ్వాలని అక్కడి నుంచి వీసీకి లేఖ రావడం, చివరకు 14వ తేదీ నుంచి పనులకు అనుమతులు ఇచ్చినట్లు 16న ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. అది కూడా ఏయూ వీసీ కాకుండా.. రిజిస్ట్రార్ పేరుతో అసిస్టెంట్ రిజిస్ట్రార్(అకౌంట్స్) సంతకంతో అనుమతులు ఇవ్వడం మరింత చర్చనీయాంశమైంది. కాగా.. ఏయూలోని స్టాళ్లలో సగానికి పైగా ఎటువంటి లైసెన్సులు లేకుండానే ఏర్పాటైనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పోలీసులు ఆదివారం మధ్యాహ్నం కొంత సేపు హడావుడి చేసి వెళ్లిపోయారు.
ఉన్నత విద్యా శాఖ జోక్యం
ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో బాణసంచా స్టాళ్లను ప్రతి ఏటా ఏర్పాటు చేయడం సాధారణం. దీనికి ఏయూ వీసీ అనుమతులు ఇవ్వడం సర్వసాధారణ విషయం. కానీ ఈ సారి మాత్రం స్టాళ్ల అనుమతుల అంశం గందరగోళంగా, వివాదాస్పదంగా మారింది. ఏయూ మైదానాలను, ప్రాంగణాలను ప్రైవేట్ కార్యక్రమాల కోసం అనుమతులు ఇవ్వకూడదని ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది నెలల కిందట బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సినిమా ఈవెంట్‌కు అనుమతులు ఇవ్వడం తీవ్ర దుమారం రేగింది. దీంతో అప్పటి నుంచి ప్రైవేట్ కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వడం లేదు. ఇటీవలే క్రెడాయ్ ఒక కార్యక్రమ నిర్వహణకు ఈ మైదానాన్ని లీజుకు కోరగా.. ఇదే కారణంతో తిరస్కరించారు. అయితే.. దీపావళి సందర్భంగా ఏటా మాదిరిగానే ఈసారి కూడా ఇంజినీరింగ్ గ్రౌండ్‌లో స్టాళ్ల ఏర్పాటుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. దుకాణాల కోసం మైదానాన్ని లీజుకు ఇవ్వాలని జీవీఎంసీ కమిషనర్ కేతర్ గార్గ్ ఏయూ వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్‌కు లేఖ రాశారు. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు దుకాణాల పనులకు, 18 నుంచి 20వ తేదీ వరకు అమ్మకాలకు, 21న స్టాళ్ల తొలగింపునకు అనుమతులు ఇవ్వాలని కోరారు. దీనిపై వీసీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ 13వ తేదీ నుంచే గ్రౌండ్‌లో పనులు చేపట్టేశారు. దీనిపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో కలెక్టర్ హరేందిర ప్రసాద్ సీరియస్ అయ్యారు. అనుమతులు లేకుండా ఎలా స్టాళ్లు ఏర్పాటు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే తొలగించాలని ఆదేశించారు. అనంతరం ఆయన అనుమతుల కోసం రాష్ట్ర ఉన్నత విద్యా శాఖకు లేఖ రాశారు. దీంతో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ కార్యాలయం నుంచి ఏయూ వీసీకి లేఖ వచ్చింది. కలెక్టర్ లేఖపై సమస్యను పరిష్కరించి, 14 నుంచి అనుమతులు ఇవ్వాలని 15న లేఖ పంపించడం ఇక్కడ విశేషం.
పనులు ప్రారంభించాక అనుమతులు
కలెక్టర్ ఆదేశాలతో ఇంజినీరింగ్ కాలేజ్ హెలిప్యాడ్ మైదానంలో ఉన్న స్టాళ్ల పనులను తొలగించారు. రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ జోక్యంతో కొత్తగా దుకాణాలను పార్కింగ్ మైదానానికి మార్చారు. ఇదిలా ఉండగా.. 15న ఉన్నత విద్యా శాఖ నుంచి లేఖ వస్తే, 16న ఏయూ అధికారులు అనుమతులు ఇచ్చారు. అది కూడా 14న పనులకు అనుమతులు ఇస్తున్నట్లు 16న ఉత్తర్వులు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రధానంగా ఈ అనుమతుల పత్రంపై ఏయూ వీసీ సంతకంతో కాకుండా, రిజిస్ట్రార్ పేరుతో అసిస్టెంట్ రిజిస్ట్రార్ (అకౌంట్స్) సంతకం ఉండడం గమనార్హం. తమ చేతికి మట్టి అంటకుండా, ఏదైనా సమస్య వస్తే దాన్ని కింది వారిపైకి నెట్టేసే ఉద్దేశంతోనే ఈ విధంగా చేశారన్న చర్చ జరుగుతోంది.
అనుమతులు లేకుండా స్టాళ్లు
నగరంలో అనుమతులు లేకుండా బాణసంచా నిల్వలు, వ్యాపారాలపై పోలీసులు వారం రోజులుగా వరుస దాడులతో హడావుడి చేశారు. కానీ ఏయూలో అనేక దుకాణాలు అనుమతులు లే కుండా ఏర్పాటు చేసినా పట్టించుకోలేదు. బాణసంచా విక్రయాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి స్పష్టం చేశారు. కానీ ఏయూలో ఇష్టానుసారంగా వ్యాపారాలు చేస్తున్నా పోలీసులు చూసీచూడనట్లు వదిలేశారు. ఆదివారం మధ్యాహ్నం డీసీపీ, ఏసీపీలు వెళ్లి అనుమతులు లేని స్టాళ్లను వెంటనే మూసేయాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో అటువంటి వారిపై చర్య లు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసి వెళ్లిపోయారు. కానీ ఏ ఒక్కరూ పోలీసుల హెచ్చరికులు పట్టించుకోకుండా అనుమతులు లేకుండా బాణసంచా విక్రయాలు చేపట్టడం గమనార్హం.
ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో బాణసంచా విక్రయాలు

దివాళీ ధోకా