గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫ్యాక్టరీని మూసివేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి తాజాగా మహాజనసభను ఆరునెలలు వాయిదా వేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఊతమిస్తున్నాయి. ఫ్యాక్టరీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకూ | - | Sakshi
Sakshi News home page

గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫ్యాక్టరీని మూసివేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి తాజాగా మహాజనసభను ఆరునెలలు వాయిదా వేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఊతమిస్తున్నాయి. ఫ్యాక్టరీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకూ

Oct 11 2025 6:10 AM | Updated on Oct 11 2025 6:10 AM

గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయి.

గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయి.

మహాజనసభ 6 నెలలు వాయిదా

ప్రతి ఏటా సెప్టెంబర్‌ 30న నిర్వహణ

ఈ ఏడాది వాయిదా వేయడం వెనుక ఆంతర్యమేంటి?

ఆర్థిక సాయం చేయకపోగా మూసివేసే దిశగా ప్రభుత్వం చర్యలు

ప్రశ్నార్థకంగా 24 వేల మంది రైతులు, కార్మికుల భవితవ్యం

మహాజనసభ పెట్టకపోతే ఆందోళనకు దిగుతామన్న ఫ్యాక్టరీ పరిరక్షణసమితి

గోవాడ సుగర్స్‌పై

నీలి నీడలు

చోడవరం:

హాజనసభ పెట్టాలంటూ గత రెండునెలలుగా రైతులు నిరాటంకంగా ఉద్యమం చేస్తున్నారు. అయినా చెరకు రైతుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోలేదు. గత నెల 30న జరగాల్సిన మహాజనసభ నిర్వహణపై ఇప్పటి వరకూ కనీసం ఒక్క ప్రకటన కూడా చేయలేదు. నిర్వహిస్తారా.. లేదా అనేది ఏమీ చెప్పలేదు. తాజాగా మహాజనసభ నిర్వహణను ఆరునెలల తర్వాత ఆలోచిస్తామంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గడువును యాజమాన్యమే కోరిందంటూ మరో షాక్‌ ఇచ్చింది. అసలు సభ నిర్వహణపై యాజమాన్యం ఆరునెలల గడువు ఎందుకు కోరింది. ఫ్యాక్టరీని మూసేయాలన్న ఆలోచనతో ప్రభుత్వమే మహాజనసభ నిర్వహించకుండా ఆ నెపాన్ని యాజమాన్యంపై నెట్టేస్తుందా అనే ప్రశ్నలు సర్వత్రా చెరకు రైతుల్లో నెలకొన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏడాదిన్నరగా ఫ్యాక్టరీకి ప్రభుత్వం ఒక్క పైసా సాయం చేయలేదు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా రూ.10 కోట్ల నుంచి 20 కోట్ల వరకూ సాయం చేసి ఐదేళ్లలో సుమారు రూ. 89 కోట్లు అందించింది. దీనితో ఫ్యాక్టరీ ఆర్థికంగా నష్టాల్లో ఉన్నా రైతులకు చెరకు పేమెంట్స్‌, కార్మికులకు జీతాలు ఎక్కడా బకాయి లేకుండా ఐదేళ్లు క్రషింగ్‌ కూడా సజావుగానే సాగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది సుమారు లక్షా 14 వేల టన్నుల క్రషింగ్‌ చేశారు. ఆ చెరకు సరఫరా చేసిన రైతులకు ఇప్పటి వరకూ పేమెంట్స్‌ చేయలేదు. అంతేకాదు కార్మికులకు ఐదు నెలులుగా జీతాలు కూడా ఇవ్వలేదు. రైతులకు కార్మికులకు కలిసి సుమారు రూ. 29 కోట్లు తక్షణం చెల్లించాల్సి ఉంది.

క్రషింగ్‌ సన్నాహాలు లేవు

ఈ ఏడాది క్రషింగ్‌ సీజన్‌ ప్రారంభం కావడానికి రెండునెలలు మాత్రమే గడువు ఉంది. క్రషింగ్‌కు సంబంధించి ఇంకా ఇప్పటి వరకు ఫ్యాక్టరీలో ఎటువంటి ఓవరాయిలింగ్‌ పనులు చేపట్టలేదు. ఫ్యాక్టరీ ఏరియాలో చెరకు లక్ష టన్నులు కార్సితోట, మరో 20 వేల టన్నుల వరకు ఉడుపు తోటలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. రైతుల వద్ద ఉన్న ఈ చెరకై నా గానుగాడాలంటే ఫ్యాక్టరీలో మిషనరీకి ఓవరాయిలింగ్‌ పనులు ఇప్పటికే ప్రారంభించాల్సి ఉంది. అది కూడా చేయలేదు. ఈ ఏడాది క్రషింగ్‌ జరుగుతుందా లేదా అనే మీమాంసలో ఉన్న అనేక మంది రైతులు క్రషింగ్‌ ప్రకటన వచ్చిన వెంటనే చెరకు తోటలు వేద్దామని ఎదురుచూస్తున్నారు. అదును మీరిపోయినా ఇప్పటి వరకూ క్రషింగ్‌పై ఎటువంటి ప్రకటన రాలేదు. ప్రభుత్వ ఆర్థికంగా కనీసం రూ. 40 కోట్లు అయినా ఇస్తే తప్ప ఈ ఏడాది క్రషింగ్‌ చేయలేమని ఇప్పటికే ఫ్యాక్టరీ యాజమాన్యం తేల్చిచెప్పేసింది. అంటే ఇక ప్రభుత్వమే ఫ్యాక్టరీని నడిపించాల్సిందేనని అర్థమైంది. క్షేత్రస్థాయిలో ఉన్న ఈ సమస్యలన్నీ యాజమాన్యానికి, రైతులకు, కార్మికులకు అందరికీ తెలుసు. అయినప్పటికీ మహాజనసభ నిర్వహిస్తే ఫ్యాక్టరీ మనుగడ, చెరకు రైతుల మనుగడపై ఒక నిర్దిష్టమైన అంచనాకు వచ్చి తర్వాత ఏమి చేయాలనే దానిపై చర్చించుకోవచ్చనే ఆలోచనలో రైతులంతా మహాజనసభ నిర్వహించాలని రెండు నెలలుగా ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు.

మహాజనసభ నిర్వహించకపోతే ఆందోళన

చెరకు రైతుల సమస్యలు పట్టించుకోకుండా వారి బాధలు వినకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పరిరక్షణ సమితి పేర్కొంది. 24 వేల మంది చెరకు రైతులు, 600మంది కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడితే సహించేదిలేదని హెచ్చరించింది. మహాజన సభను వెంటనే నిర్వహించాలని, రైతుల సమస్యలు సభ ద్వారా ప్రభుత్వం వినాలని, ఫ్యాక్టరీ మనుగడపై సభ ద్వారా రైతులకు ప్రభుత్వ నిర్ణయం చెప్పాలని డిమాండ్‌ చేసింది. వెంటనే మహాజనసభ నిర్వహించాలని, లేనిపక్షంలో ప్రత్యక్షం ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామంటూ స్పష్టం చేసింది.

నాటి ‘కూటమి’ మాటలేమయ్యాయి?

ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, లోకేష్‌, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులంతా ఫ్యాక్టరీని ఆదుకుంటాం, ఆదునీకరిస్తాం, చెరకు రైతులకు టన్నుకి రూ.4 వేల గిట్టుబాటు ధర ఇస్తామని అనేక ప్రగల్భాలు పలికారు. వారంతా ఇప్పుడు ఫ్యాక్టరీపై నోరు మెదపడం లేదు. చోడవరం ఎమ్మెల్యే కెఎస్‌ఎన్‌ఎస్‌ రాజు అయితే ఏకంగా చెరకు బదులు మొక్కజొన్న వేసుకోండంటూ బహిరంగంగానే చెబుతున్నారు. మహాజనసభ పెట్టి రైతుల సమస్యలు విని ప్రత్యామ్నాయం వైపు నడిపించాల్సిన ప్రభుత్వం ఏకంగా మహాజనసభనే ఆరునెలల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై అనుమానాలు తలెత్తాయి. కనీసం రూ. 50 కోట్లు ఇచ్చి చెరకు రైతులను, కార్మికులను, సుగర్‌ ఫ్యాక్టరీని ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఏకంగా సభను వాయిదా వేయడం ద్వారా ఫ్యాక్టరీని మూసివేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆరునెలలు వాయిదా అంటే ఈ క్రషింగ్‌ సీజన్‌ పూర్తిగా పోతుంది. అంటే క్రషింగ్‌ సీజన్‌ ఉండదన్నది స్పష్టంగా అర్థమౌతోంది. మరి క్షేత్రస్థాయిలో ఫ్యాక్టరీని నమ్ముకొని చెరకు పండించిన 24 వేల మంది రైతులు, కార్మికులు ఏమైపోతారు, వారి మనుగడ ఏంటి అనే ఆలోచన కూడా ప్రభుత్వం చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement