
గిరిజనుల వేదన... అరణ్య రోదన
ఎత్తైన కొండ శిఖరంపై కష్టాల వలయంలో కించుమండ గ్రామం
చదువు కోసం బంధువుల ఇళ్లల్లో ఈ గ్రామ చిన్నారుల నివాసం
బడి, రహదారి సౌకర్యం లేక సతమతం
తల్లిదండ్రుల ప్రేమానురాగాలకు దూరం
రోగం వస్తే 3 కి.మీ మేర డోలీ మోయాల్సిందే
అక్షర జ్ఞానం కోసం ఆ గిరిజన బాలల సాహసకృత్యం కఠిన హృదయాలను సైతం కదిలిస్తుంది. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం, పాఠశాల లేకపోవడంతో సమీప గ్రామాల్లోని బంధువుల ఇళ్లల్లో ఉంటూ చదువుకుంటున్న గిరిజన విద్యార్థుల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. బాల్యదశలో వారు తల్లిదండ్రుల ప్రేమానురాగాలకు దూరమవుతున్నారు. దేవరాపల్లి మండలం గరిశింగి పంచాయతీ శివారు కించుమండలోని గిరిజన బాలల దుస్థితి ఇది. ఇంకా అనేక సమస్యలు ఆ గ్రామాన్ని వేధిస్తున్నాయి.
దేవరాపల్లి:
బాహ్య ప్రపంచానికి దూరంగా ఎత్తైన కొండ శిఖరంపై ఉన్న కించుమండ గ్రామంలో కనీస సదుపాయాలు లేక గిరిజన ప్రజలు దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు. ఇక్కడి గ్రామానికి చేరుకోవాలంటే దట్టమైన అటవీ ప్రాంతం గుండా పెద్ద పెద్ద బండలు, పొదలు దాటుకుంటూ సుమారు 3 కి.మీ మేర ప్రమాదకర ప్రయాణం చేయాలి. ఎత్తైన ఈ కొండపైకి చేరుకోవడానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. ప్రతి 10 నిముషాలకు విశ్రాంతి తీసుకుంటే తప్ప ముందుకు సాగే పరిస్థితి ఉండదు. మండల కేంద్రం దేవరాపల్లికి సుమారు 12 కి.మీ, పంచాయతీ కేంద్రం గరిశింగికి సుమారు 5.కి.మీ దూరంలో ఈ గ్రామం ఉంది. కించుమండలో సుమారు నాలుగు తరాలుగా ఇక్కడి గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ గ్రామంలో 13 ఇళ్లు ఉండగా 51 మంది గిరిజనులు నివాసం ఉంటున్నారు. వీరిలో 15 మంది విద్యార్థులు ఉన్నారు.
బడి కోసం... కన్నవారికి దూరంగా..
నిరక్షరాస్యులైన తాము కనీసం తమ పిల్లలకై నా అక్షర జ్ఞానం కల్పించి ప్రయోజకులను చేయాలని ఇక్కడి గిరిజనులు తపిస్తూ ఉంటారు. అయితే కొండ శిఖరంపై ఉన్న తమ గ్రామంలో పాఠశాల, రహదారి సౌకర్యం లేకపోవడం వారికి గుదిబండగా మారింది. కొండ దిగువన సమీప గ్రామాల్లో ఉన్న పాఠశాలకు ప్రతి రోజూ వెళ్లి వచ్చే పరిస్థితి లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో దూరపు బంధువుల ఇళ్లల్లో ఉంచి చదివించాలని కఠిన నిర్ణయం తీసుకున్నారు. గ్రామానికి చెందిన చిన్నారులు ఇదే పంచాయతీ పరిధిలోని వేలంబయలు, డొర్రి చెరువు, కొత్తూరు తదితర గ్రామాల్లో బంధువుల ఇళ్లల్లో ఉంటూ చదువుకుంటున్నారు. బంధువులు సైతం ఇబ్బంది పడుతున్నా తప్పని పరిస్థితిల్లో ఏళ్ల తరబడి అక్కడే ఉంచి చదివిస్తున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేగులబంద ప్రాథమిక పాఠశాల్లో ఐదుగురు, గరిశింగి పాఠశాల్లో మరికొంత మంది విద్యాభ్యాసం చేస్తున్నారు.
కనీస సదుపాయాలు కరువు
కించుమండ ప్రజలు కనీస సదుపాయాలు లేక దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు. తాగునీరు, విద్యుత్ సదుపాయం ఉన్నప్పటికీ రోడ్డు ఇతర అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇతరత్ర సదుపాయాలు లేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఇటు ప్రజాప్రతినిధులు కాని, అటు అధికారులు గాని గ్రామానికి వచ్చిన పరిస్థితి లేదు. ఆశా కార్యకర్త తప్ప వైద్య సిబ్బంది రాని దుస్థితి. వెరసి వైద్యం అందని ద్రాక్షగా మిగిలింది. ఎవరికి రోగం వచ్చినా డోలీ కట్టి కొండ దిగువకు దించాల్సిన దుస్థితి. అత్యవసరమైతే మంచంపై మరణించాల్సిందే తప్ప వేరే దారి లేదు. వైద్య సేవలందించిన తర్వాత కూడా పూర్తిగా నయం అయ్యే వరకు బంధువుల ఇళ్లల్లో ఉంటున్న దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.

గిరిజనుల వేదన... అరణ్య రోదన