
‘కళింగ’లో క్షిపణి నాణ్యత పరిశీలన
● అందుబాటులోకి అత్యాధునిక స్టాటిక్ ఫైరింగ్ ఫెసిలిటీ ‘త్రినేత్ర’ ● భీమిలిలో ‘అగ్నివీరు’ల కోసం త్రీడీ బిల్డింగ్ నిర్మాణం
త్రినేత్ర సెంటర్‌ని ప్రారంభిస్తున్న ఈఎన్‌సీ చీఫ్ వైస్ అడ్మిరల్ పెంధార్కర్
సాక్షి, విశాఖపట్నం : వ్యూహాత్మక నేవల్ బేస్ ఐఎన్‌ఎస్ కళింగ అత్యాధునిక వ్యవస్థలకు కేంద్ర బిందువుగా మారింది. నావల్ వెపన్ సిస్టమ్స్‌ను పరీక్షించడానికి అత్యాధునిక స్టాటిక్ ఫైరింగ్ ఫెసిలిటీ ’త్రినేత్ర’ని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ శుక్రవారం ప్రారంభించారు. నౌకాదళ ఆయుధ సంపత్తి నాణ్యత పరిశీలన, లైఫ్‌టైమ్ చెకింగ్ మొదలైన అంశాల కోసం... ఇప్పటి వరకూ ఫారిన్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఓఈఎం)పైనే భారత నౌకాదళం ఆధారపడేది. ఇకపై భీమిలి కేంద్రంగా ఐఎన్‌ఎస్ కళింగలో ఏర్పాటు చేసిన త్రినేత్ర ద్వారా ఈ పరీక్షలు విజయవంతంగా నిర్వహించనున్నారు. క్షిపణులు, రాకెట్‌లు, ఆయుధాల సామర్ధ్యమెలా ఉంది.? ఇంకా వాటి జీవిత కాలం ఎన్ని రోజులు ఉంటుంది.? మొదలైన పరిశీలనలు చేసే అత్యాధునిక సాంకేతికత త్రినేత్రలో ఏర్పాటు చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇక్కడి పరికరాల్ని తయారు చేసినట్లు తూర్పు నౌకాదళ వర్గాలు పేర్కొన్నాయి.