
అన్నయ్య కంటే చంద్రబాబే ఎక్కువయ్యారా?
దేవరాపల్లి/మునగపాక: అసెంబ్లీ సాక్షిగా చిరంజీవిపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించకపోవడం దారుణమని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు, పార్టీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ విమర్శించారు. సొంత అన్నయ్యను వాడు.. వీడు అంటూ బాలకృష్ణ చులకనగా మాట్లాడినా పవన్ కల్యాణ్ ఆ వ్యాఖ్యలను ఖండించకపోవడంలో మర్మమేంటని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై, కేంద్ర మాజీమంత్రి చిరంజీవిపై అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముత్యాలనాయుడు.. బొడ్డేడ ప్రసాద్, పార్టీ జోన్–1 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధలతో కలిసి తారువలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ మునగపాకలో కూడా బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించారు.‘ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో మానసిక స్థితి సరిగా లేని వ్యక్తితో అమర్యాదకరంగా మాట్లాడించి సభా ప్రతిష్టకు భంగం కలిగించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో వీధిరౌడీలా చొక్కా గుండీలు విప్పుకుని, నెత్తి మీద కళ్లజోడు పెట్టుకుని, రెండు చేతులు జేబుల్లో పెట్టుకుని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, చిరంజీవిని కించపరిచేలా మాట్లాడిన తీరును రాష్ట్ర ప్రజలంతా చూశారు.’అని అన్నారు. కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రులు, డిప్యూటీ స్పీకర్ సైతం బాలకృష్ణ వ్యాఖ్యలను ప్రోత్సహించేలా ప్రవర్తించారే తప్ప ఒక్కరూ ఖండించలేదని మండిపడ్డారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించకపోవడం చూస్తుంటే.. ఆయనకు అన్నయ్య కంటే చంద్రబాబే ముఖ్యమైనట్లు కనిపిస్తోందని విమర్శించారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు గౌరవప్రదంగా నడుచుకోవాలని, బాలకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, చిరంజీవికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 2004లో స్నేహితులపై బాలకృష్ణ తన ఇంట్లో తుపాకీతో కాల్పులకు తెగబడిన ఘటనను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. మానసిక పరిస్థితి బాగోలేదని మెడికల్ సర్టిఫికెట్ తెచ్చుకున్నది నీవే కదా అంటూ నిప్పులు చెరిగారు.
చిరంజీవిపై అసెంబ్లీలో
బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు
స్పందించడంలో పవన్ మౌనం ఎందుకు?
మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని
విమర్శించే స్థాయి లేదు
అహంకారపూరిత వ్యాఖ్యలను
బాలకృష్ణ ఉపసంహరించుకోవాలి
బూడి ముత్యాలనాయుడు,
బొడ్డేడ ప్రసాద్ డిమాండ్