
కుదిపేసిన కుండపోత
● ఈదురుగాలులకు కూలిన చెట్లు..
తెగిపడిన విద్యుత్ వైర్లు
● నేలకూలిన ఇళ్లు.. చెట్లు పడి
దెబ్బతిన్న వాహనాలు
యలమంచిలి రూరల్: నియోజకవర్గంలోని యలమంచిలి, మునగపాక మండలాల్లో ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై కుండపోతగా కురిసిన వర్షానికి లోతట్టుప్రాంతాలు మునిగాయి. యలమంచిలిలో గంట వ్యవధిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పట్టణంలో పలు వీధులు,అంతర్గత రహదారుల్లో పదుల సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి.కొన్ని చోట్ల నిలిపి ఉంచిన కార్లు,బైక్‌లపై చెట్లు,చెట్ల కొమ్మలు పడడంతో ఆ వాహనాలు దెబ్బతిన్నాయి. భవనంవీధిలో విద్యుత్ స్తంభం కూలిపోయింది. పలు చోట్ల విద్యుత్ వైర్లు తెగిపడడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. లైనుకొత్తూరు వద్ద పాత జాతీయ రహదారిపై భారీ చింత చెట్టు రోడ్డుకు అడ్డంగా కూలిపోయి,హెచ్‌టీ లైన్ల వైర్లు తెగిపోయాయి.ఆ మార్గం మీదుగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.విద్యుత్,పోలీసు శాఖల అధికారులకు సమాచారం అందించినట్టు తహసీల్దార్ కె.వరహాలు తెలిపారు.కొక్కిరాపల్లిలో పిడుగు పడి కీర్తి లక్ష్మికి చెందిన గేదె మృతి చెందింది. పట్టణంలోని రాంనగర్‌లో ఓ ఇంటిపై చెట్టు కూలడంతో పాక్షికంగా దెబ్బతింది. కూలిన చెట్లను తొలగించేందుకు మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు, ఇంజినీర్లు గణపతిరావు, నానాజీ, సిబ్బంది పొక్లెయిన్‌లతో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. రోడ్లపై కూలిన చెట్లను తొలగించి, ఆదివారం సాయంత్రం 6 గంటలకు చాలావరకు రాకపోకలు పునరుద్ధరించగలిగారు. వర్షంతో కొన్నిచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో పాదచారులు నడిచి వెళ్లడానికి ఇబ్బంది పడ్డారు. పలు ప్రాంతాల్లో అరటి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. వరి,ఇతర పంటలకు ఈ వర్షం బాగా మేలు చేస్తుందని రైతులు చెబుతున్నారు.
మునగపాకలో...
మునగపాక: మండల వ్యాప్తంగా శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. హుద్‌హుద్ తుఫాన్ సమయంలో మాదిరిగా భారీగా గాలులు వీయడంతో పాటు కుండపోతగా వర్షం కురవడంతో పలు చోట్ల చెట్లు కూలిపోవడంతో పాటు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మునగపాక మెయిన్‌రోడ్డులో ఆడారి చంద్రమోహన్ ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ద్విచక్ర వాహనంపై కొబ్బరి చెట్టు పడడంతో వాహనం నుజ్జయింది. మునగపాక బీసీ కాలనీలో పై అంతస్తులో ఏర్పాటు చేసుకున్న షెడ్‌లు దెబ్బతిన్నాయి. తమకు న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్ సత్యనారాయణకు బాధితులకు విన్నవించారు.కాగా విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ ఏఈ శరగడం జగదీష్ చర్యలు తీసుకున్నారు.
జిల్లాలో పలుచోట్ల జనజీవనం అస్తవ్యస్తం

కుదిపేసిన కుండపోత