
మానవత్వం చాటుకున్న యువకులు
ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన ‘డేంజర్ గాయ్స్’ సభ్యులు
మునగపాక: స్థానిక డేంజర్ గాయ్స్ యువజన సంఘం సభ్యులు మానవత్వం చాటుకున్నారు. ఒకవైపు గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతూ మరోవైపు సోషల్ మీడియా ద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని గుర్తించి వారికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. విశాఖలో గోపాలపట్నానికి చెందిన పావని, వాసు దంపతులకు కుమారుడు అయాన్తేజా. ఆ బాబు బోన్ మేరో వ్యాధితో సతమతమవుతున్నాడు. ఇందుకు గాను సర్జరీ చేయాల్సి ఉంది. బాబు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో సర్జరీ చేయించలేక ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న మునగపాకకు చెందిన యూ ట్యూబర్ సునీల్‌తో అనకాపల్లికి చెదిన యూ ట్యూబర్ మురళి.. అలాగే డేంజర్ గాయ్స్ సభ్యులు కలిసి సోషల్ మీడియా ద్వారా మరింత ప్రచారం చేసి పలువురి నుంచి రూ.1,70,500 నగదును సేకరించారు. సేకరించిన నగదును వాసు, పావని దంపతులకు అందజేశారు.
ప్రమాదస్థాయికి ‘కోనాం’ నీటిమట్టం
300 క్యూసెక్కుల విడుదల
చీడికాడ: కోనాం జలాశయం పరిసరాల్లో ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంతో ఇన్‌ఫ్లో భారీగా పెరగడంతో జలాశయం నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరువలో ఉందని ఇన్‌చార్జి ఏఈ సత్యనారాయణదొర తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు కాగా ప్రస్తుతం 99.80 మీటర్లకు చేరుకుంది. ఇన్‌ఫ్లో ఒక్కసారిగా 400 క్యూసెక్కులకు పెరగడంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఆదివారం సాయంత్రం నుంచి ప్రధాన గేట్ల ద్వారా దిగువకు 300 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇన్‌ఫ్లోను బట్టి రాత్రికి నీటి విడుదలను పెంచే అవకాశం ఉందన్నారు.