విశాఖ స్వరూపం మారుతుందా? | - | Sakshi
Sakshi News home page

విశాఖ స్వరూపం మారుతుందా?

Sep 22 2025 6:49 AM | Updated on Sep 22 2025 6:49 AM

విశాఖ స్వరూపం మారుతుందా?

విశాఖ స్వరూపం మారుతుందా?

పెందుర్తి అసెంబ్లీ పూర్తిగా

విశాఖలో ఉంచాలనే ప్రతిపాదన

విశాఖ ఎంపీ పరిధిలోని ఎస్‌.కోటనీ

విలీనం చేసేందుకు సన్నాహాలు

ప్రస్తుతం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో

పెందుర్తి నియోజకవర్గం

నియోజకవర్గం మొత్తం విశాఖ జిల్లాలో

ఉండాలని కూటమి నేతల విజ్ఞప్తులు

త్వరలో మంత్రివర్గ ఉప సంఘం

ముందు ప్రతిపాదనలు

మహారాణిపేట: జిల్లా సరిహద్దుల మార్పుపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాన్ని పూర్తిగా, ఎస్‌.కోట అసెంబ్లీని పాక్షికంగా విశాఖ జిల్లాలో విలీనం చేసే ప్రతిపాదనలపై చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం జిల్లాలో జీవీఎంసీ పరిధి 89శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతం కేవలం 11 శాతం మాత్రమే ఉంది. ఈ గ్రామీణ ప్రాంతాన్ని పెంచడం, అలాగే అవకాశం ఉన్న ప్రాంతాలను జీవీఎంసీలో విలీనం చేయడం వంటి ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి.

పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ బాబు ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి పునర్విభజన అంశాలను తీసుకువచ్చారు. పెందుర్తి నియోజకవర్గంలోని పెందుర్తి మండలం ఇప్పటికే విశాఖ జిల్లాలో ఉండగా, అదే నియోజకవర్గంలోని సబ్బవరం, పరవాడ మండలాలను కూడా విశాఖ జిల్లాలో విలీనం చేయాలని ఎమ్మెల్యే కోరారు. దీనిపై పరిశీలన చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

విశాఖ పార్లమెంటరీ

నియోజకవర్గంలో ఎస్‌.కోట

విశాఖ పార్లమెంట్‌ పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు విశాఖ జిల్లాలో ఉన్నాయి. విశాఖ తూర్పు, విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణం, విశాఖ పశ్చిమం, భీమిలి, గాజువాక. అయితే ఎస్‌.కోట అసెంబ్లీ నియోజకవర్గం మాత్రం విజయనగరం జిల్లాలో ఉంది. ఈ పరిస్థితి వల్ల ప్రజల పరామర్శలు, పర్యటనలు, ఇతర కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పార్లమెంట్‌ సభ్యులు భావిస్తున్నారు. అందుకే ఎస్‌.కోటను విశాఖ జిల్లాలో విలీనం చేయడంపై అధ్యయనం జరుగుతోంది. ఒకే ఎంపీ పరిధిలోని అన్ని నియోజకవర్గాలు ఒకే జిల్లాలో ఉంటే ఎలా ఉంటుందనే దానిపై వివిధ శాఖల అధికారుల అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారు.

జిల్లా భౌగోళిక స్వరూపంలో మార్పులు

ఒకప్పుడు పెద్ద జిల్లాగా ఉన్న విశాఖ ఇప్పుడు చిన్నగా మారింది. గతంలో మైదాన, గిరిజన, పట్టణ ప్రాంతాలు విశాఖ జిల్లాలో భాగంగా ఉండేవి. జిల్లాల విభజన తర్వాత గ్రామీణ ప్రాంతం తగ్గి, గిరిజన ప్రాంతం పూర్తిగా లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాలు తక్కువగా ఉన్న విశాఖ జిల్లాలో అదనపు ప్రాంతాలను కలిపితే ఎలా ఉంటుందనే దానిపై అధికార యంత్రాంగం పరిశీలిస్తోంది. ఈ చర్చలు విశాఖ జిల్లా భౌగోళిక స్వరూపాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా, కొన్ని ప్రాంతాలను ఆయా జిల్లాల్లో కలపడానికి కసరత్తు జరుగుతోంది.

జిల్లా పునర్విభజన కమిటీ

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. వాటిలో కొన్నింటిని సవరించడానికి కూటమి ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. జిల్లాల సంఖ్యను పెంచడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ప్రతిపాదనలను కూడా ఈ ఉప సంఘం పరిశీలిస్తోంది. జిల్లాల విలీనం, తొలగింపు వంటి అంశాలను ఈ కమిటీ అధ్యయనం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement