పదేళ్ల తర్వాత యుద్ధ నౌకల పండగ | - | Sakshi
Sakshi News home page

పదేళ్ల తర్వాత యుద్ధ నౌకల పండగ

Sep 5 2025 5:42 AM | Updated on Sep 5 2025 5:42 AM

పదేళ్ల తర్వాత యుద్ధ నౌకల పండగ

పదేళ్ల తర్వాత యుద్ధ నౌకల పండగ

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో

ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ

2016 తర్వాత ఆతిథ్యమిస్తున్న భారత్‌

విశాఖ కేంద్రంగా మరోసారి

నిర్వహణకు సిద్ధం

145 దేశాలకు ఆహ్వానం

పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్న

ఇండియన్‌ నేవీ

ఈసారి చైనాకు ఆహ్వానించే అంశంపై

రక్షణ మంత్రిత్వ శాఖ చర్చలు

సాక్షి, విశాఖపట్నం : విశాఖ మరోసారి అంతర్జాతీయ కార్యక్రమానికి వేదిక కానుంది. 2026 ఫిబ్రవరిలో భారత నౌకాదళం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ, మిలాన్‌–2026 విన్యాసాలను నిర్వహించనుంది. దాదాపు పదేళ్ల తర్వాత విశాఖలో జరుగుతున్న ఈ యుద్ధ నౌకల ప్రదర్శన కోసం దాదాపు 145 దేశాలను ఆహ్వానించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే చైనాను ఆహ్వానించాలా వద్దా అనే విషయంపై ప్రస్తుతం రక్షణ మంత్రిత్వ శాఖలో చర్చలు జరుగుతున్నాయి. తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రంగా ఉన్న విశాఖ.. గతంలో 2022లో ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ, మిలాన్‌ విన్యాసాలను విజయవంతంగా నిర్వహించింది. అలాగే 2024లోనూ రికార్డు స్థాయిలో మిలాన్‌ విన్యాసాలు జరిగాయి. ఇప్పుడు ఈ అంతర్జాతీయ యుద్ధ నౌకల ప్రదర్శనతో విశాఖ ప్రాముఖ్యత మరింత పెరగనుంది.

ఏమిటీ ఫ్లీట్‌ రివ్యూ

దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు సాగరంలో ఎదురుదాడికి దిగగల సత్తా చాటేందుకు నావికాదళ విన్యాసాలు ప్రపంచదేశాలకు చాటేందుకు నిర్దేశించినవే ఫ్లీట్‌ రివ్యూలు. భారత సుప్రీం కమాండర్‌ అయిన దేశాధ్యక్షుని సమక్షంలో ఈ విన్యాసాలు చోటు చేసుకుంటాయి. ఇప్పటికే భారత్‌ 2001లో ముంబైలోనూ 2016లో విశాఖలో ఐఎఫ్‌ఆర్‌ని నిర్వహించిన అనుభవం ఉంది. ఇప్పుడు మరోసారి అంతర్జాతీయ యుద్ధనౌకల విన్యాసాలకు వేదికగా విశాఖ నిలుస్తోంది. ప్రపంచానికే నాగరికత నేర్పిన దేశంలో తొలి టైడల్‌ డాక్‌ని భారత్‌ నిర్మించింది. చంద్రగుప్త కాలం నుంచే భారతీయులు సముద్రయానంపై మంచి పట్టు సాధించినట్లు చరిత్ర పేర్కొంటున్నది. నాటినుంచి నేటి అణుజలాంతర్గాముల నిర్మాణంలోనూ స్వయంచాలితంగా ఎదిగిన భారత్‌ ప్రపంచదేశాలను ఆకర్షిస్తూనే ఉంది. అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శనతో మరోసారి ప్రపంచదేశాల దృష్టి విశాఖ తీరంవైపు సాగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 24 వరకూ ఐఎఫ్‌ఆర్‌తో పాటు మిలాన్‌–2026ని విశాఖలో నిర్వహించనున్నారు.

తొలిసారి 25.. మూడోసారి 145

2001లో భారత్‌లో తొలిసారి ముంబైలో ఐఎఫ్‌ఆర్‌ నిర్వహించిన సమయంలో 25 దేశాలు హాజరయ్యాయి. 2016లో విశాఖలో నిర్వహించినప్పుడు 51 దేశాలు హాజరయ్యాయి. 2025లో ఇండోనేషియాలోని బాలి సముద్ర తీరంలో ఐఎఫ్‌ఆర్‌లో 30 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో 145 దేశాలకు ఆహ్వానం పంపించాలని భారత్‌ నిర్ణయించింది. ఈ మేరకు ఇండియన్‌ నేవీ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ.. ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ విన్యాసాల్లో భారత నావికా దళానికి చెందిన సర్ఫేస్‌ యుద్ధనౌకలు, జలాంతర్గాములతోపాటు నావల్‌ ఏవియేషన్‌ విమానాలు పాల్గొంటున్నాయి. ఢిల్లీ క్లాస్‌, రాజ్‌పుత్‌ క్లాస్‌, కమోర్తా క్లాస్‌, విశాఖ క్లాస్‌, శివాలిక్‌ క్లాస్‌, బ్రహ్మపుత్ర క్లాస్‌, నీలగిరి మొదలైన తరగతులకు చెందిన యుద్ధ నౌకలతో పాటు జలాంతర్గాములు, యుద్ధనౌకలకు అన్నివిధాల సహకారాన్ని అందించే ఫ్లీట్‌ టాంకర్లు, టార్పెడో రికవరీ వెసల్స్‌, గ్రీన్‌టగ్స్‌ సత్తా చాటనున్నాయి. అలాగే కోస్ట్‌ గార్డ్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) వంటి ఇతర సముద్ర సంస్థలకు చెందిన నౌకలు ఈ ఫ్లీట్‌ రివ్యూలో భాగస్వామ్యం కానున్నాయి.

చైనాని పిలవాలా.. వద్దా.?

ఇటీవల చైనాతో చర్చలు జరిగిన నేపథ్యంలో..ఐఎఫ్‌ఆర్‌కు చైనాను ఆహ్వానించాలా వద్దా అనే అంశంపై రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక చర్చలు జరుపుతోంది. 2016లో నిర్వహించిన ఐఎఫ్‌ఆర్‌కు చైనాని ఆహ్వానించగా రెండు యుద్ధ నౌకలు, ఓ జలాంతర్గామి విన్యాసాల్లో పాలుపంచుకున్నాయి. ఈసారి ఆహ్వానం అందించాలా వద్దా అనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తోందని నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకూ భారత్‌లో జరిగే ఏ విన్యాసాలకు పాక్‌ని ఆహ్వానించలేదు. రాబోతున్న ఐఎఫ్‌ఆర్‌, మిలాన్‌–2026కి కూడా ఆహ్వానం లేదని రక్షణ వర్గాలు తెగేసి చెబుతున్నాయి. ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఖండాలకు చెందిన దేశాలు ఐఎఫ్‌ఆర్‌లో భాగస్వామ్యం కాబోతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement