
రణరంగం
● బల్క్‌డ్రగ్ పార్కుపై ప్రజాభిప్రాయ సేక‘రణం’ ● వ్యతిరేకుల నోరు నొక్కేందుకు తీవ్ర యత్నాలు ● అడుగడుగునా పోలీసుల మోహరింపు ● ముందస్తు అరెస్టులపై మండి పడ్డ గంగపుత్రులు ● అడ్డంకులను దాటుకొని సభలో పాల్గొన్న బాధితులు ● చావనైనా చస్తాం గానీ బల్క్‌డ్రగ్ ఏర్పాటు చేయనివ్వబోమని శపథం
బల్క్‌డ్రగ్ పార్కుపై ప్రజాభిప్రాయ సేకరణ రణరంగాన్ని తలపించింది. చావనైనా చస్తాం, బల్క్‌డ్రగ్ ఏర్పాటు చేయనివ్వబోమని రైతులు, మత్స్యకారులు స్పష్టం చేశారు. వారి వ్యతిరేకతను ముందే గ్రహించిన ప్రభుత్వం గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. నిర్వాసితులు ఎవరూ వేదిక వద్దకు రాకుండా శతవిధాలా ప్రయత్నించారు. గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులతోపాటు ఎక్కడికక్కడ అడ్డుకున్నా బల్క్‌డ్రగ్ పార్కు ప్రభావిత ప్రాంత ప్రజలు పోరాడి తమ హక్కును సాధించుకున్నారు. తమ వ్యతిరేక వాణిని వినిపించారు.
బల్క్‌డ్రగ్ పార్క్ వద్దంటూ నినాదాలు చేస్తున్న మత్స్యకారులు, (ఇన్‌సెట్) బారికేడ్లు దాటుకుని వేదిక వద్దకు వస్తున్న వైస్ ఎంపీపీ నానాజీ
నక్కపల్లి:
రాత్రికి రాత్రి 500 మంది పోలీసులను దించారు. బుధవారం తెలతెలవారుతుండగానే వైఎస్సార్‌సీపీ, సీపీఎం, రైతు నాయకులు వీసం రామకృష్ణ, గంటా తిరుపతిరావు, గొర్ల గోవిందరావు, ఎం.అప్పలరాజు, ఎం.రాజేష్, తళ్ల భార్గవ్‌లను గృహ నిర్బంధం చేశారు. మత్స్యకార గ్రామాల నుంచి నిరసన తెలిపేందుకు ఎవరూ రాకుండా ముందు రోజు రాత్రే పోలీసులు కవాతు నిర్వహించి ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించారు. అయినప్పటికీ రాజయ్యపేట, గుడివాడ, గుర్రాజుపేట, పెదతీనార్ల, చినతీనార్ల, జానకయ్యపేట గ్రామాల నుంచి వచ్చిన వారిని వందలాది మంది పోలీసులు జాతీయరహదారిపై బారికేడ్లు పెట్టి వేదిక వద్దకు రాకుండా అడ్డుకున్నారు. బారికేడ్లను తోసుకుంటూ వారు వేదిక వద్దకు రావడానికి ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. తమ ఆవేదన, అభ్యంతరాలను తెలుపుకునేందుకు అవకాశమివ్వని అధికారుల అవకాశవాదంపై బాధితులు ఆగ్రహం చెందారు. తాము ఎమ్మెల్యేగా గెలిపించిన హోం మంత్రి అనిత ఫ్లెక్సీని చెప్పుతో కొట్టారు.
వాణి వినిపించారు..
చావనైనా చస్తాం కానీ.. రాజయ్యపేట సమీపంలో బల్క్‌డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఒప్పుకోబోమని మండలంలో పలు గ్రామాలకు చెందిన మత్స్యకారులు, బాధిత గ్రామ ప్రజలు స్పష్టం చేశారు. రాజయ్యపేట సమీపంలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో 1270 ఎకరాల్లో రూ.1257 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న బల్క్‌డ్రగ్ పార్క్‌పై తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో వారు తమ వాణి వినిపించారు. సభకు నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ అధ్యక్షత వహించారు. పోలీసుల అడ్డంకులను దాటుకొని వేదిక ప్రాంగణానికి చేరుకున్న ఆందోళకారులంతా రెండు బృందాలుగా విడిపోయారు. కొంతమంది వేదిక గేటు ముందు, కొంతమంది తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు, పవన్ కల్యాణ్, హోం మంత్రి అనితలపై ఆగ్రహంతో శాపనార్ధాలు పెట్టారు. 2014లో చంద్రబాబు ప్రజల భూముల జోలికి వచ్చిన అధికారులను చెట్లకు కట్టికొట్టాలని పిలుపు నిచ్చారని, అదే చంద్రబాబు ఇప్పుడు భూములు లాక్కొని ప్రజల ప్రాణాలు తీసే పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. స్థానికులకు ఉద్యోగాలిస్తామని చెప్తారు కానీ ఇవ్వరన్నారు. ఇతర ప్రాంతాల్లో వ్యతిరేకించిన పరిశ్రమలను నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకులకే మాట్లాడే అవకాశం ఇస్తున్నారని ఆక్షేపించారు. కంపెనీలకు అనుకూలంగా టీడీపీ నాయకులు మాట్లాడుతున్న సమయంలో ఆందోళనకారులు అరుపులు కేకలతో అడ్డు తగిలారు. తమకు కూడా మాట్లాడే అవకాశం కల్పించాలంటూ వైఎస్సార్‌సీపీ మండలశాఖ అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, వైస్ ఎంపీపీలు వీసం నానాజీ, వెలగా ఈశ్వరరావు, నాయకులు గొర్ల బాబూరావు తదితరులు బారికేడ్లు తోసుకుంటూ వేదిక ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని వెనక్కినెట్టేశారు. దీంతో ఆందోళనకారులు వేదిక వద్దకు దూసుకు వచ్చేందుకు ప్రయత్నించడంతో అధికారులు గత్యంతరం లేక వారికి కూడా మాట్లాడే అవకాశం కల్పించారు. సభలో పాల్గొనేందుకు విశాఖ నుంచి వచ్చిన సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు లోకనాథంను అరెస్టు చేసి అనకాపల్లి తరలించారు.
స్థానిక ఉద్యోగం.. పక్కా మోసం
స్థానికులకు ఉద్యోగాలు అనే ది పక్కా మోసం. నేను,హెటెరోలో ఉద్యోగం కోసం వెళ్తే స్థానికుడనని ఇవ్వలేదు. శత్రు దేశాలతో యుద్ధం చేసినప్పడు భయపడలేదు. కానీ ఇక్కడ కంపెనీలు పెడుతున్నారంటే భయం వేస్తోంది.
–బాలు, మాజీ సైనికోద్యోగి, ఉపమాక
ఈ ప్రాంతీయులంటే అంత చులకనా?
బల్క్‌డ్రగ్ పార్క్ ఏర్పాటయితే ఈ ప్రాంతంలో మరణ మృదంగం వినిపిస్తుంది. ప్రజలు సుఖంగా జీవించే పరిస్థితి ఉండదు. కాకినాడ జిల్లాలో వ్యతిరేకించిన కంపెనీని ఇక్కడ ఎలా పెడతారు. ఈ ప్రాంతీయుల ప్రాణాలంటే అంత చులకనా?
– వరలక్ష్మి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు
జెట్టీ నిర్మించండి
మాకు ఈ బల్క్‌డ్రగ్ వద్దు. మా ప్రాణాలు ముఖ్యం. గత ప్రభుత్వంలో 24 కోట్లతో మంజూరు చేసిన జెట్టీ నిర్మించండి చాలు. ఏదోలా బతుకుతాం. కొత్త కంపెనీలు పెట్టి మా ప్రాణాలు తీయొద్దు. మీకు దణ్ణం పెడతాం.
–పిక్కి సత్తియ్య, ఎంపీటీసీ (టీడీపీ), రాజయ్యపేట
మేము అనుకూలం
బల్క్‌డ్రగ్ పార్క్ ఏర్పాటుకు మేము అనుకూలం. రైతులకు, మత్స్యకారులకు నష్టం లేకుండా చూస్తాం. అభివృద్ధి జరగాలంటే కంపెనీలు రావాల్సిందే.
–కొప్పిశెట్టి వెంకటేష్, టీడీపీ ఇన్‌చార్జ్
అమరావతిలో పెట్టొచ్చు కదా
ఇప్పటికే పలు కంపెనీలతో అనేక రోగాలు వచ్చి బాధ పడుతున్నాం. బల్క్‌డ్రగ్ పార్కు ఇక్కడే ఎందుకు.. అమరావతిలో పెట్టొచ్చు కదా? ఈ కంపెనీ పెడితే రైతులంతా ఉరేసుకుని చావాల్సిందే. ఏమీ మిగలదు.
–డీవీఎస్‌ఎన్ రాజు, రైతు, పెదతీనార్ల
భవిష్యత్ అంధకారమే
మా కుటుంబానికి చెందిన 79 ఎకరాల భూమిని తీసుకుంటున్నారు. ఏపీఐఐసీ ప్రకటించిన అధ్యయన నివేదిక తప్పుల తడక. అత్యంత ప్రమాదకరమైన 30 కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. భవిష్యత్ అంతా అంధకారమే.
–మహాదేవ్ ఉపాధ్యాయుల, గుర్రాజుపేట, ఎస్.రాయవరం మండలం
ప్రాణాంతకం
మాకు 3 ఎకరాల భూమి ఉంది. మొత్తం తీసేసుకుంటున్నారు. అభిప్రాయం చెప్పడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారు. కంపెనీ ఏర్పాటు చేస్తే 50 ఏళ్లకు చనిపోయేవారు 20 ఏళ్లకే చనిపోతారు. పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాం.
–దాట్ల ఉమాదేవి, మహిళా రైతు, గుర్రాజుపేట
ప్రజారోగ్యానికి హాని
ప్రజలు వ్యతిరేకించే పరిశ్రమను ఏర్పాటు చేయడం తగదు. నిర్వాసితులకు ఇంకా పూర్తిగా నష్టపరిహారం చెల్లించలేదు. ఆరోగ్యానికి హాని కలిగించే పరిశ్రమలు ఏర్పాటు చేయడం మంచిది కాదు. అభిప్రాయాలు చెప్పేందుకు వచ్చే వారిని పోలీసులు అడ్డుకోవడం దారుణం.
–కంబాల జోగులు, మాజీ ఎమ్మెల్యే
●
రాజ్యాంగ హక్కును కాలరాస్తున్నారు
తమ గోడు చెప్పుకునేందుకు వచ్చే వారిని నిర్బంధించడం సరికాదు. వేదిక వద్దకు వెళ్లకుండానే ముందుగా అరెస్టు చేయ డం రాజ్యాంగ హక్కును కాలరాయడమే. ప్రశ్నించే వారిని బెదిరించి అనుకూలంగా మలచుకోవాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది.
–కె.లోకనాథం, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు
రెడ్‌బుక్ రాజ్యాంగం
మత్స్యకారులకు అండగా నిలబడ్డామన్న అక్కసుతో ముందుగానే గృహ నిర్బంధం చేసి అరెస్టు చేశారు. ప్రశ్నించే గొంతు నొక్కాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పోలీసులు రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు.
–వీసం రామకృష్ణ, వైఎస్సార్‌సీపీ నేత
అంగీకరించే ప్రసక్తి లేదు
రైతులు భూములు ఇవ్వమని చెప్తే టీడీపీకి చెందిన కొంతమంది భూస్వాముల దగ్గర భూములు తీసుకుని మిగిలిన వారిని బెదిరించి లాక్కున్నారు. ఈ పార్క్ ఏర్పాటును అంగీకరించే ప్రసక్తి లేదు. ఎటువంటి కేసులకై నా సిద్ధం.
గొర్ల బాబూరావు, రైతు నాయకుడు
విష వాయువులు ముంచేస్తాయి
మా ఊరికి సమీపంలో ఉన్న కంపెనీ నుంచి వచ్చే విష వాయువుల వల్ల మా సర్పంచ్ కొడుకు క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. మళ్లీ అటువంటి కంపెనీలు పెడితే సహించేది లేదు. పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తాం.
–పిక్కి స్వామి, జనసేన నాయకుడు
డిప్యూటీ సీఎంకు ఇది తగదు
పవన్ కల్యాణ్‌కు మత్స్యకారుల గోడు పట్టడం లేదని ఆందోళనకారులు మండిపడ్డారు. బల్క్‌డ్రగ్ పార్కు కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేస్తామంటే వద్దని తొండంగిలో ధర్నా చేశారని, నక్కపల్లిలో ఎందుకు చేయడం లేదంటూ నిలదీశారు. రాజయ్యపేటలో హోం మంత్రి అనితకు 2 వేల ఓట్ల మెజార్టీ ఇచ్చామని, అందుకు తగిన బహుమతి ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు గ్రామంలో ఆమె ఎలా అడుగుపెడతారో చూస్తామని హెచ్చరించారు. రాజయ్యపేటకు చెందిన కొంతమంది కార్యకర్తలు కంపెనీలకు అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేయడంతో వారికి నిరసనకారులు దేహశుద్ధి చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ప్ర,జాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులు తిరిగి వెళ్లకుండా వాహనాలకు అడ్డంగా బైఠాయించారు. సీఐలు కుమారస్వామి, రామకృష్ణలు నచ్చజెప్పి పంపించేశారు. డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

రణరంగం

రణరంగం

రణరంగం

రణరంగం

రణరంగం

రణరంగం

రణరంగం

రణరంగం

రణరంగం

రణరంగం

రణరంగం

రణరంగం

రణరంగం

రణరంగం

రణరంగం