
గురి తప్పిన హత్యాయత్నం
ఎస్.రాయవరం: కిరాయి గూండాల గురి తప్పింది. తాగిన మైకంలో ఒకరి బదులు మరొకరిపై హత్యాయత్నం చేశారు. హత్యకు మరోసారి యత్నించిన క్రమంలో అసలు సూత్రధారులతో సహా పోలీసులకు చిక్కారు. ఇన్‌చార్జి డీఎస్పీ మోహన్‌రావు అడ్డురోడ్డు సర్కిల్ కార్యాలయంలో శనివారం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. అడ్డురోడ్డుకు చెందిన ఓ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరి హత్యకు కుట్ర పన్నిన కిరాయి రౌడీలు.. ఈనెల 11న ఆయన బదులు పొరపాటున వెంకటేశ్వర కల్యాణమండపం వాచ్‌మన్ నాగేశ్వరరావు తలపై రాడ్డుతో కొట్టి చంపబోయారు. అపస్మారకస్థితికి చేరుకున్న నాగేశ్వరరావును చూసి అతని భార్య, పిల్లలు కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి పరిస్థితి ఇప్పటికీ విషమంగా ఉంది.
అసలు విషయమేంటంటే..
ఈ కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న ఎస్.రాయవరానికి చెందిన నూకేశ్వరి కుటుంబ తగాదాల కారణంగా మూడేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయింది. భర్తపై తరుచు పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదులు చేసేది. ఆ సమయంలో అడ్డురోడ్డుకు చెందిన విలేకరి ఆమెకు పరిచయమై పోలీస్ స్టేషన్‌కు తోడు వెళ్లేవాడు. ఆమె వద్ద నుంచి కొంత డబ్బులు, ఆరున్నర తులాల బంగారం తీసుకున్నాడు. ఆ తర్వాత ఆయన సహకరించకపోవడంతో తన నగదు, బంగారం తిరిగి ఇచ్చేయాలని నూకేశ్వరి అడిగింది. దానికి ఆ విలేకరి నిరాకరించడంతో అతనిపై కూడా ఆమె పోలీస్ స్టేషన్‌కి ఫిర్యాదు చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వైరం మరింత పెరిగింది. ఆ విలేకరి నూకేశ్వరి ఇంట్లోను, ఆమెకు సన్నిహితుడైన బర్రె పైడిరాజు (ఏ 2) ఇంట్లోను.. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని చెప్పి తగువులు పెట్టాడు. దీంతో నూకేశ్వరి, పైడిరాజు కలిసి తునికి చెందిన శామ్యూల్ అలియాస్ శ్యాము (ఏ 3 ), ఈసరపూడి జాన్‌ప్రసాద్ అలియాస్ శవాలు (ఏ 4), రాయుడు రాజ్‌కుమార్ (ఏ 5)లతో విలేకరి హత్యకు రూ.లక్ష సుపారి ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. కిరాయి రౌడీలు అడ్డురోడ్డు వచ్చి మద్యం తాగి విలేకరిని చంపబోయి కల్యాణ మండపంలో నాగేశ్వరరావును కొట్టారు. దాడి జరిగింది విలేకరిపై కాదని తెలుసుకున్న నూకేశ్వరి, పైడిరాజు దాడి చేయమని వారిని మళ్లీ పంపారు. అందరూ కలిసి అడ్డురోడ్డు వచ్చారు. అప్పటికే పరిసర ప్రాంతాల్లో నిఘా ఉంచిన పోలీసులకు శుక్రవారం సాయంత్రం అడ్డురోడ్డు శివారులో పట్టుబడ్డారు. అడ్డురోడ్డు సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ విభీషణరావు చాకచక్యంగా సిబ్బందితో ఐదుగురిని ఒక్కసారిగా పట్టుకుని అరెస్టు చేశారు. శనివారం రిమాండ్‌కు తరలించారు.
ఒకరి బదులు మరొకరిపై దాడి
మద్యం మత్తులో కిరాయి రౌడీల నిర్వాకం
విరోధి హత్యకు కుట్ర పన్నిన నిందితులు
ఈ ఘటనలో వాచ్‌మన్‌కు తీవ్ర గాయాలు
ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు