● 4 నెలలుగా అందని వేతనాలు.. విడుదల కాని మెస్ చార్జీలు ● నిర్వాహకులకూ భారంగా మధ్యాహ్న భోజన పథకం ● అప్పు చేసి ఎన్నాళ్లు నడపాలని ఆవేదన ● చీమ కుట్టినట్టయినా లేని కూటమి సర్కారు
సాక్షి, అనకాపల్లి: చాలీచాలని వేతనాలు.. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల కారణంగా పెట్టిన పెట్టుబడి రాక మధ్యాహ్న భోజన పఽథకం నిర్వాహకులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. వీటికి తోడుగా నాలుగు నెలలుగా వేతన బకాయిలు రాకపోవడంతో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు నిర్వహణ మరింత భారంగా మారింది. కిరాణా దుకాణాల నుంచి సరకులు అరువు తెచ్చి భోజనం వండుతున్న పరిస్థితులున్నాయి. నెలల తరబడి అరువు ఇవ్వడానికి కిరాణా షాపు యజమానులు నిరాకరించడంతో పలుచోట్ల బంగారు వస్తువులు తాకట్టు పెట్టి మధ్యాహ్న భోజన పథకం నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. ఇదే పరిస్థితులు కొనసాగితే భవిష్యత్తు కష్టతరం అవుతుందంటూ ఇప్పటికే డీఈవో, ఏఈవో కార్యాలయాల వద్ద ధర్నాలు, నిరసనలు కూడా నిర్వహించారు. అయినా ప్రభుత్వం తీరులో మార్పు రాలేదు. గౌరవ వేతన బకాయిలు, మెస్ బిల్లుల చెల్లింపు గురించి పట్టించుకోవడం లేదు.
మొత్తం రూ.8 కోట్ల బకాయిలు
జిల్లా విద్యాశాఖ గణాంకాల ప్రకారం మధ్యాహ్న భోజనానికి నెలకు రూ.2.18 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వీటిలో ప్రాథమిక పాఠశాలలకు రూ.40.65 లక్షలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.55.43 లక్షలు, ఉన్నత పాఠశాలలకు రూ.42.15 లక్షలు, ప్రాథమిక పాఠశాలలకు అదనపు మెనూ చార్జీలు రూ.3.2 లక్షలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు అదనపు మెనూ చార్జీలు రూ.2.71 లక్షలు, హైస్కూళ్లకు అదనపు మెనూ చార్జీలు రూ.2.06 లక్షలు, సీసీహెచ్–1000కు రూ.24 లక్షలు, సీసీహెచ్–2000కు రూ.24.14 లక్షలు కేటాయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులకు గత మూడు నెలలుగా, జూనియర్ కళాశాలల్లో నాలుగు నెలలుగా వేతనాలు, మెస్ చార్జీలు చెల్లించలేదు. ఇంతవరకు మొత్తం రూ.8 కోట్ల బకాయిలు ఉన్నాయి.
పేరెంట్స్ మీటింగ్స్‌తో అదనపు భారం
మధ్యాహ్న భోజన వంట కార్మికులకు ఇప్పటికే నాలుగు నెలలుగా బకాయి పడిన పరిస్థితుల్లో యోగా డే, పేరెంట్స్ మీటింగ్స్ సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులకు సైతం భోజనం పెట్టాల్సి రావడంతో మరింత భారం పడిందని వాపోతున్నారు. పేరెంట్స్ మీటింగ్‌లకు వచ్చే వీఐపీలకు ఒక మెనూ, విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక మెనూ, విద్యార్థులకు ఒక మెనూ వండిస్తున్నారు. విద్యార్థుల రోజువారి మెనూ ఖర్చుతో పోల్చితే పేరెంట్స్ మీటింగ్ ఒక్క రోజుకు మూడు రెట్లు ఖర్చవుతుంది. ఒకవైపు శ్రమ, మానసిక ఒత్తిడి.. మరోవైపు ప్రభుత్వం ఇచ్చే చార్జీలకు మూడింతల ఖర్చుతో సతమతమవుతున్నారు.
వారికి వేతనాలు,
మెస్ చార్జీల బకాయి రూ.8 కోట్లు
ఐదుగురి జీతం 8 మంది పంచుకుంటాం
నేను చోడవరం బాలికల హైస్కూ ల్లో గత 23 ఏళ్లుగా పనిచేస్తున్నాను. ఈ స్కూల్లో మొత్తం 8 మంది పనిచేస్తున్నాం. కానీ జీతం వచ్చేది ఐదుగురికే. అదే అందరం పంచుకుంటాం. ఇప్పుడు స్కూల్స్ రేషనలైజేషన్ కారణంగా ఒక శానిటేషన్ వర్కర్, ఒక మిడ్ డే మీల్స్ వంట కార్మికుడి ఉద్యోగం కూడా పోయింది. విద్యార్థులు తగ్గిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల ఉపాధి మరింత తగ్గనుంది. అంతో ఇంతో వచ్చే వేతనం కూడా బకాయి పెడితే ఎలా?
– గూనూరు వరలక్ష్మి, మిడ్ డే మీల్స్ వంట కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు
చార్జీలు పెంచాలి
మధ్యాహ్న భోజనం పథకం పెట్టినప్పటి నుంచి 20 ఏళ్లుగా ఇందులోనే పనిచేస్తున్నాను. నిత్యావసర సరకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వం ఇచ్చే సొమ్ము ఏ మూలకూ సరిపోవడం లేదు. సగటున ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం పాఠశాలల్లో ఒక ప్లేటుకు రూ.5.90, జూనియర్ కళాశాలల్లో ప్లేటుకు రూ.8.57 ఇస్తుంది. కానీ మాకు రెట్టింపు ఖర్చవుతోంది. ప్లేటుకు రూ.15 నుంచి రూ.20 వరకు చెల్లిస్తేనే మాకు గిట్టుబాటు అవుతుంది.
–గండి రమణమ్మ, జోడుగుళ్లు,
సబ్బవరం మండలం
జిల్లాలో మధ్యాహ్న
భోజన పథకం కార్మికులు, హెల్పర్ల సంఖ్య
2,064
‘మధ్యాహ్న భోజన’ కార్మికుల ఆకలి కేకలు
‘మధ్యాహ్న భోజన’ కార్మికుల ఆకలి కేకలు