
నకిలీ.. మకిలి..
బుచ్చెయ్యపేట: నాణ్యత లేని విత్తనాలు.. చిత్తశుద్ధి లేని ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం చెందుతున్నారు. మొలకెత్తని విత్తనాలు అంటకట్టి తమ జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు సహాయ కేంద్రాలకు వచ్చిన విత్తనాలు బాగులేవని అధికారులు వెనక్కు పంపేశారు. ప్రైవేటు దుకాణాల్లో కొని వేసిన విత్తనాలకు సైతం సరిగా మొలకలు రాకపోవడంతో కోపోద్రిక్తులైన రైతులు షాపులకు వెళ్లి గొడవ చేశారు. వడ్డాదిలోని ప్రైవేటు షాపులో కొనుగోలు చేసిన ఆర్‌జీఎల్ రకం వరి విత్తనాలు నాటకపోవడం వారి ఆవేదనకు కారణం. ఒక్కో బస్తాను రూ.1,250కి కొనుగోలు చేశారు. వరి విత్తనాలు వేసి 15 రోజులు దాటినా ఆకుమడి సరిగా నాటలేదని, నకిలీ విత్తనాలు అంటకట్టారని రైతులు బొబ్బాది రాజు, రావాడ ప్రసాద్, రావాడ సింహాచలం, వరహాలబాబు, వెలుగుల నూకరాజు, దాడి జగ్గారావు తదితర రైతులు ఆవేదన చెందుతున్నారు. నకిలీ విత్తనాలు సరఫరా చేయడంపై షాపు నిర్వాహకుడిని నిలదీశారు. వ్యవసాయ శాఖ సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
విత్తనాలను వెనక్కు పంపిన వ్యవసాయ శాఖ
మంగళాపురం, విజయరామరాజుపేట రైతు సహాయ కేంద్రాలకు ప్రభుత్వం ఆర్‌జీఎల్ 2537 లాట్ నెంబర్ –003 రకం ధాన్యం విత్తనాలను 70 క్వింటాళ్లకుపైగా సరఫరా చేసింది. రైతులకు విత్తనాలు అందించకముందే వీటి మొలక శాతాన్ని వ్యవసాయశాఖ సిబ్బంది పరిశీలించారు. వారం రోజులు దాటాక కేవలం 40 నుంచి 50 శాతం మాత్రమే మొలక శాతం వచ్చింది. నకిలీ విత్తనాలుగా గుర్తించిన వ్యవసాయశాఖ సిబ్బంది రైతులు తిరగబడతారని వాటిని అమ్మకాలు చేయలేదు. వరి విత్తనాల బస్తాలను తిరిగి ఏపీ సీడ్స్‌కి పంపించేశారు. తరవాత మరో లాట్ విత్తనాలను తీసుకొచ్చి రైతులకు విక్రయించారు. దీంతో పలువురు రైతులు ఆలస్యంగా ఆకుమడులు వేశారు. నకిలి విత్తనాలు సరఫరా చేసిన ఏపీ సీడ్స్ కంపెనీపైన, ప్రైవేటు విత్తన వ్యాపారులపై తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు.
మొలకెత్తని విత్తనాలపై రైతుల ఆగ్రహం
ప్రైవేటు దుకాణాలతోపాటు రైతు సేవాకేంద్రాల్లోనూ నాణ్యత లేని విత్తనమే..
న్యాయం చేయాలని కోరుతున్న అన్నదాతలు
చర్య తీసుకోవాలి
ప్రైవేటు దుకాణంలో వరి విత్తనాలు నాణ్యంగా ఉంటాయని వడ్డాది షాపులో రెండు బస్తాల ఆర్‌జీఎల్ రకం విత్తన బస్తాలు కొన్నాను. మొలక సరిగా రాలేదు. నకిలీ విత్తనాలు విక్రయించారు. ఇంట్లో ఉన్న ధాన్యాన్ని తీసుకెళ్లి రెండోసారి వేసుకోగా బాగానే నాటింది. ఆ వ్యాపారిపై అధికారులు చర్యలు తీసుకుని మాకు పరిహారం అందించి ఆదుకోవాలి.
– రావాడ ప్రసాద్, వడ్డాది
పట్టించుకునేవారు లేరు
వడ్డాదిలో ప్రైవేటు విత్తన దుకాణంలో రెండు బస్తాల ఆర్‌జీఎల్ రకం విత్తనాల బస్తాలను రూ, 2,500కు కొనుగోలు చేశాను. విత్తనాలు వేసి 15 రోజులు దాటినా సరిగా మొలక రాలేదు. ప్రైవేటు షాపు నిర్వాహకుడిని అడిగినా, వ్యవసాయశాఖ సిబ్బందికి చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు న్యాయం చేయాలి.
– బొబ్బాది రాజు, వడ్డాది
ప్రభుత్వమే నకిలీ విత్తనాలు ఇస్తే ఎలా?
మా గ్రామ సచివాలయానికి వచ్చిన ఆర్‌జీఎల్ రకం విత్తనాలకు మొలక శాతం కట్టగా సరిగా నాటలేదు. దీంతో వ్యవసాయశాఖ సిబ్బంది నకిలీ విత్తనాల బస్తాలను తిరిగి పంపించేశారు. ప్రభుత్వం ఇలా చేయడం తగదు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. సకాలంలో విత్తనాలు అందకపోవడంతో ఆలస్యంగా వరి ఆకులు వేశాను.
– దుడ్డు రమణ, మంగళాపురం

నకిలీ.. మకిలి..

నకిలీ.. మకిలి..

నకిలీ.. మకిలి..

నకిలీ.. మకిలి..