
సీజనల్ వ్యాధులపై అశ్రద్ధ చూపితే కఠిన చర్యలు
తుమ్మపాల: వర్షాకాలం నేపథ్యంలో జిల్లాలో సీజనల్ వ్యాధుల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎంపీడీవోలు, లైన్ విభాగాల క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు అధికంగా ప్రబలే ప్రమాదం ఉండటంతో గ్రామాల్లో నిల్వ నీరు లేకుండా చర్యలు తీసుకోవాలని, డ్రైనేజీలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని వినియోగించాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి పైపుల లీకేజీలను సరిచేయాలన్నారు. ప్రతి శుక్రవారం ‘డ్రై డే’ కార్యక్రమాలను సచివాలయ సిబ్బంది సహకారంతో నిర్వహించాలన్నారు. వ్యాధుల నిర్ధారణ పరీక్షలు ముమ్మరంగా నిర్వహించి, నివారణ చర్యలు పటిష్టంగా అమలు చేయాలని చెప్పారు. పురపాలక సంఘాల్లో యాంటీ లార్వా, ఫాగింగ్ ఆపరేషన్లు విస్తృతంగా చేపట్టి కాలువలు, డ్రైనేజీల్లో మందుల పిచికారీ చేయాలని ఆదేశించారు. అంగన్‌వాడీలు, వసతి గృహాల ప్రాంగణాల్లో గడ్డి, చెత్తను ఉపాధి హామీ పనుల్లో భాగంగా తొలగించాలన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ బాటిళ్ల నిషేధం
స్వచ్ఛత కోసం క్లాప్ మిత్రులను నియమించి వారికి జీతాలు సమయానికి చెల్లించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అధికారులు రోజువారీ గ్రామాల్లో చేయాల్సిన పనులను సమర్ధవంతంగా నిర్వర్తిస్తే వ్యాధులు ప్రబలే అవకాశం ఉండదన్నారు. ఎటువంటి అశ్రద్ధను సహించబోమని హెచ్చరించారు. ఈ నెల 19న నిర్వహించనున్న స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి అధికారి తప్పకుండా పాల్గొనాలన్నారు. ఇకపై జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, అధికార సమావేశాల్లో ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. సాధ్యమైనంత వరకు పునర్వినియోగించదగిన పదార్థాలు ఉపయోగించాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ విజయ కృష్ణన్